Stock market: బుధవారం దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఈ రోజు ప్రతికూలంగా ప్రారంభించిన మార్కెట్లు రోజు ముగిసే వరకు అదే బాటలో కొనసాగాయి. ఏ దశలో కూడా మార్కెట్లకు కొనుగోళ్ల నుంచి మద్దతు లభించలేదు. దీంతో నాలుగు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడినట్టు అయింది. ఫలితంగా మార్కెట్లు మే నెలను నష్టాలతో ముగింపు పలికాయి. అమెరికాలో అప్పుల పరిమితి పెంపు బిల్లు ఈ రోజు రాత్రి ఓటింగ్‌కు రానుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో అప్రమత్తత నెలకొంది. మన మార్కెట్లపై కూడా ఇదే ప్రభావం చూపింది. అదే విధంగా గురువారం వీక్లీ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ ఉండటం కూడా మార్కెట్లను ప్రభావితం చేసింది.
6 పైసలు తగ్గిన రూపాయి మారకం విలువ(Stock market)
ఉదయం సెన్సెక్స్ 62,839.97 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 62,876.77 నుంచి 62,401.02 మధ్య కదలాడింది. చివరకు 346.89 పాయింట్ల నష్టంతో 62,622.24 దగ్గర ముగిసింది. నిఫ్టీ 18,594. 20 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,603.90 నుంచి 18,483.85 మధ్య ట్రేడైంది. చివరకు 99. 45 పాయింట్లు నష్టపోయి 18,534.40 దగ్గర స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 6 పైసలు పతనమై 82.73 దగ్గర నిలిచింది.
సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టైటన్, హెచ్‌యూఎల్ , భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్ షేర్లు బాగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి. బలమైన వృద్ధి అంచనాల నేపథ్యంలో జిందాల్ సా లిమిటెడ్ షేరు ఈ రోజు 14.06 శాతం లాభపడి రూ.240.20 దగ్గర స్థిరపడింది.