Stock market: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. సోమవారం ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. మార్కెట్లు ముగిసే సమయానికి అమ్మకాలు వెల్లువెత్తాయి. ఉదయం సెన్సెక్స్ 62,759.19 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 62,943.20 నుంచి 62,751.72 మధ్య కదలాడింది. చివరకు 240.36 పాయింట్ల లాభంతో 62,787.47 దగ్గర ముగిసింది. నిఫ్టీ 18,612.00 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,640.15 నుంచి 18,582.80 మధ్య ట్రేడ్ అయింది. చివరకు 59.75 పాయింట్లు లాభపడి 18,593.85 దగ్గర స్థిరపడింది. మార్కెట్లు ముగిసేటప్పటికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 29 పైసలు పతనమై రూ. 82.68 దగ్గర నిలిచింది.
సెన్సెక్స్ 30 సూచీలో మారుతీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్, సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఐటీసీ, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, టైటన్, ఎన్‌టీపీసీ షేర్లు, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌యూఎల్ ఉన్నాయి.
మహీంద్రా గ్రూప్ అమర్‌జ్యోతి బారువాను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించింది. గ్రూప్ స్ట్రాటజీ ఆఫీస్‌కు నేతృత్వం వహిస్తూ గ్రూప్‌లోని అన్ని వ్యాపారాలతో ఆయన దగ్గరగా పనిచేయనున్నారు. దీంతో ఎంఅండ్‌ఎం షేరు ధర సోమవారం 3.99 శాతం పుంజుకొని రూ. 1,394.95 దగ్గర ముగిసింది.
రాజస్థాన్‌లోని బైకనూర్‌లో టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ 110 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ రోజు టాటా పవర్ షేరు విలువ 1.51 శాతం పెరిగి రూ.218.90 దగ్గర స్థిరపడింది.