Odisa Train Accident: రైలు ప్రమాద బాధితులను ఆదుకుంటాం: రిలయన్స్ ఫౌండేషన్

ఒడిశాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ పెను విషాదంలో 270 మంది మృతి చెందగా.. 1000 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనతో చాలా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి.

Odisa Train Accident: ఒడిశాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ పెను విషాదంలో 270 మంది మృతి చెందగా.. 1000 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనతో చాలా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. అనేక మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడి శరీర అవయవాలు పోగొట్టుకున్నారు.

అయితే, ఈ ప్రమాద పరిస్థితిపై అనేక మంది తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున రక్తదానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకండా అనాథలైన పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ముందుకొచ్చారు. తాజాగా రిలయన్స్‌కు చెందిన రిలయన్స్‌ ఫౌండేషన్‌ కూడా తన దాతృత్వాన్ని తెలిపింది.

 

 

సహాయక చర్యల్లో ఆహారం అందజేత(Odisa Train Accident)

ఒడిశా రైలు ప్రమాదంలో బాధితులైన వారిని ఆదుకుంటామని రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌ పర్సన్‌ నీతా అంబానీ ప్రకటించారు. ప్రమాద ఘటనపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. ఇంటి కష్ట సమయంలో రిలయన్స్‌ ఫౌండేషన్‌ తన వంతు సాయం చేస్తుందని నీతా అంబానీ హామీ ఇచ్చారు.

 

ఇందులో భాగంగానే ప్రమాద స్థలిలో సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులకు రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆహారం అందించింది. దీనికి సంబంధించిన వీడియోను రిలయన్స్‌ ఫౌండేషన్‌ ట్విటర్‌ ద్వారా పంచుకుంది. మరోవైపు మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. రైలు ప్రమాద బాధితుల పిల్లలకు సెహ్వాగ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో విద్యను అందిస్తామని ప్రకటించారు.