Mauritius: అదానీ గ్రూప్ పై అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. అయితే తాజా ఆ నివేదిక పై మారిషస్ స్పందించింది. తమ దేశంలో అదానీ గ్రూప్ కు ఎలాంటి షెల్ కంపెనీలు లేవని మారిషస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మారిషస్ ఆర్థికశాఖ మంత్రి మహేన్ కుమార్ సీరుత్తన్ ఆ దేశ పార్లమెంటులో ప్రకటన చేశారు. హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేశారు. యూఏఈ , మారిషస్ లాంటి దేశాల్లోని షెల్ కంపెనీల ద్వారా అదానీ గ్రూప్ షేర్లు కొనుగోలు చేయించి షేర్ల విలువను పెంచుకుందని ఈ ఏడాది జనవరి 24 న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. అప్పట్లో ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ కూడా తీవ్రంగా ఖండించింది.
షెల్ కంపెనీలకు నో పర్మిషన్(Mauritius)
అయతే మారిషస్ మంత్రి పార్లమెంట్ లో మాట్లాడుతూ.. మారిషస్‌లో అదానీ గ్రూప్‌కు షెల్ కంపెనీలు ఉన్నాయన్నది అవాస్తవమని.. ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని తెలిపారు. మారిషస్ చట్టాల ప్రకారం దేశంలో షెల్ కంపెనీలకు అనుమతి లేదన్నారు. ఇప్పటి వరకు అలాంటి షెల్ కంపెనీలను గుర్తించలేదని స్పష్టం చేశారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ నిబంధనలను మారిషస్ ప్రభుత్వం కచ్చితంగా పాటిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఓఈసీడీ నిర్వహించిన తనిఖీల్లో పన్ను చెల్లింపులకు సంబంధించి ఎలాంటి అవకతవకలను గుర్తించలేదని ఆయన అన్నారు. ఈ క్రమంలో హిండెన్‌బర్గ్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని మంత్రి తెలిపారు.
సుప్రీంలో విచారణ
అదానీ గ్రూప్ షేర్ విలువను పెంచేందుకు షెల్ కంపెనీలతో అవకతవకలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్ అప్పట్లో ఆరోపించింది. దీంతో అదానీ షేరు విలువ భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ల నియంత్రించే చర్యల్ని బలోపేతం చేసేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో నాలుగు వేర్వేరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన న్యాయస్థానం, మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టి ఓ నివేదిక ఇవ్వాలని ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించింది. దాంతో పాటు సెబీ కూడా ఈ వ్యవహారంపై విచారణ జరిపి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. తాజాగా, 2 నెలల సమయం సరిపోదని, 6 నెలలు సమయం కోరుతూ సెబీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.