LIC-Adani Group: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. అదానీ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మార్చి 5 నాటికి రూ. 6,183 కోట్ల మేర ఉన్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో తెలిపారు.
డిసెంబర్ 31, 2022 నాటికి ఈ రుణాలు రూ. 6, 347 కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎల్ఐసీ నుంచి అదానీ గ్రూప్ లోని ఏయో సంస్థలు ఎంత రుణాలు తీసుకున్నాయనే వివరాలు కూడా మంత్రి తెలిపారు.
అదానీ పోర్ట్స్ అండ్ ఎస్‌ఈజెడ్ రూ. 5,388.60 కోట్లు, అదానీ పవర్ రూ.266.00 కోట్లు, అదానీ పవర్ (మహారాష్ట్ర-ఫేజ్1) రూ. 81.60 కోట్లు,
అదానీ పవర్ (మహారాష్ట్ర-ఫేజ్3) రూ. 254.87 కోట్లు, రాయ్‌గఢ్ ఎనర్జీ జనరేషన్ రూ. 45 కోట్లు, రాయ్‌పుర్ ఎనర్జెన్ రూ. 145.67 కోట్ల రుణాలు తీసుకున్నాయి.
ప్రభుత్వ రంగంలోని మిగిలిన 5 సాధారణ బీమా కంపెనీలు అదానీ గ్రూప్ కంపెనీలకు ఎలాంటి రుణాలు అందించలేదని తెలిపినట్టు ఆర్థిక మంత్రి వెల్లడించారు.
ప్రభుత్వం కమిటీ కాదు.. సెబీ విచారణ(LIC-Adani Group)
కాగా, అదానీ గ్రూప్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలు, ఆ గ్రూప్ అకౌంటింగ్ మోసాలకు ఆ సంస్థ పాల్పడినట్టు అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు
ప్రభుత్వం ఎలాంటి కమిటీని నియమించలేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి లోక్‌సభకు వెల్లడించారు.
అదానీ గ్రూప్‌కు చెందిన 9 నమోదిత కంపెనీలు జనవరి 24 నుంచి మార్చి 1 మధ్య సుమారు 60 శాతం మేర మార్కెట్ విలువ కోల్పోయాయని,
ఈ నేపథ్యంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విచారణ జరుపుతోందని మంత్రి తెలిపారు.
ఈ కంపెనీల షేర్ల ధరల్లో ఒడిదొడుకులు నిఫ్టీ 50పై పెద్దగా ప్రభావం చూపలేదని, ఈ సమయంలో నిఫ్టీ 4.5 శాతమే కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు.
అదానీ కంపెనీ దిగుమతి చేసుకుంటున్న విద్యుదుత్పత్తి, సరఫరా పరికరాల వ్యవహారంపై డీఆర్‌ఐ జరిపిన విచారణ ముగిసిందని మంత్రి తెలిపారు.
నివేదికను సంబంధిత న్యాయ అధికారులకు సమర్పించినట్లు వెల్లడించారు.