GST Collections: ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు భారీ స్థాయిలో నమోదు చేస్తున్నాయి. ఏ నెలకు ఆ నెల వస్తు సేవల పన్ను వసూళ్లలో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. కాగా, తాజాగా మే నెలకు సంబంధించిన వస్తు, సేవల పన్ను వివరాలు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. మే నెలకు గాను రూ. 1, 57, 090 కోట్లు వసూలైనట్టు ఆర్థిక శాఖ తెలిపింది. 2022, మే నెల వసూళ్లతో పోలిస్తే ఇది 12 శాతం అధికం. గత ఏడాది మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 1,40, 885 కోట్లు గా ఉంది.
మే నెలలో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ. 1, 57,090 కోట్లు వసూలైనట్టు ఆర్థిక శాఖ పేర్కొంది. అందులో సీజీఎస్టీ కింద రూ. 28,411 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ. 35,828 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ. 81,363 కోట్లు, సెస్సుల రూపంలో రూ. 11, 489 కోట్లు వసూలైనట్టు ప్రకటించింది. కాగా, ఏప్రిల్ నెలలో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ. 1,87,035 కోట్లు వసూలైన విషయం తెలిసిందే.
మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు కూడా పెరిగాయి. గత ఏడాది ఏపీలో మే నెలలో రూ. 3047 కోట్ల వసూళ్లు సాధిస్తే.. ఈ ఏడాది మే లో రూ. 3373 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. గత ఏడాది పోలిస్తే వసూళ్లు 11 శాతం మేర పెరిగాయి. అదే విధంగా తెలంగాణ కూడా జీఎస్టీ వసూళ్లలో 13 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది మే లో రూ. 3982 కోట్లు సాధించగా.. ఈ ఏడాది మే లో రూ. 4507 మేర జీఎస్టీ వసూళ్లు నమోదు చేసింది. 16 శాతం వృద్ధితో మహారాష్ట్ర 23, 536 కోట్లు వసూళ్లు సాధించింది.