Site icon Prime9

Gold prices: రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంత పెరిగిందంటే..?

Today Gold And Silver Price

Today Gold And Silver Price

Gold prices: బంగారం ధర ఒక్కసారిగా దూసుకుపోయింది. దీంతో ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా ధర పెరగడంతో దేశీయ మార్కెట్లలో పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. సోమవారం ఢిల్లీ స్పాట్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములకు) ఒకే రోజు రూ. 1400 పెరిగి రూ. 61,100 కు చేరింది.

వెండి ధర కూడా రూ. 1860 పెరిగి రూ. 69,340 కి వెళ్లింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 2005 డాలర్లు పలుకుతోంది. వెండి 22.55 డాలర్లుగా ఉందని అనలిస్టులు వెల్లడించారు.

 

బ్యాంకింగ్ రంగంలోని పరిణామాలే(Gold prices)

ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం ప్రారంభమైన రోజుల్లో బంగారానికి భారీగా డిమాండ్‌ ఏర్పడింది. యుద్ధ పరిస్థితులు ఇన్వెస్టర్లను తీవ్రంగా కలవరపెట్టాయి.

దీంతో అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర గతేడాది మార్చిలో 2052 డాలర్లు పలికింది. అయితే గత కొంతకాలంగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి.

ఈక్విటీ మార్కెట్లు రాణించడంతో బంగారం ధర దిగి వచ్చింది. ఇటీవల కాలంలో అంటే మార్చి 8 నాటికి దేశీయంగా 10 గ్రాముల బంగారం రూ. 56-57 వేల స్థాయికి వెళ్లింది.

కానీ గత రెండు వారాలుగా బ్యాంకింగ్‌ రంగంలో చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలే మళ్లీ బంగారం ధరలు భారీగా పెరగడానికి కారణమయ్యాయి.

గత 10 రోజుల వ్యవధిలోనే పసిడి రూ. 56 వేల స్థాయి నుంచి రూ. 60 వేల స్థాయికి చేరింది.

 

బంగారం వైపు భారీగా పెట్టుబడులు..(Gold prices)

అమెరికాలో ఎప్పుడైతే సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ దివాళా తీసిందో.. అప్పటి నుంచి ఇన్వెస్టర్లలో భయాలు మొదలయ్యాయి.

దానికి తోడు రోజుల వ్యవధిలోనే సిగ్నేచర్‌ బ్యాంక్‌ మూతపడటం, స్విట్జర్లాండ్‌కు చెందిన క్రెడిట్‌ సూయిజ్‌ పతనావస్థకు చేరడం లాంటి పరిణామాలు ఇన్వెస్టర్ల భయాలను మరింత పెంచాయి.

దీంతో ఎక్కువ సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం వైపు పెట్టుబడులను కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో అంతర్జాతీయ గోల్డ్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2000 డాలర్లను తాకింది. యూఎస్‌ గోల్డ్‌ ఫ్యూచర్‌ సైతం 2 శాతం పెరిగి 2012 డాలర్లకు చేరింది.

అయితే, గత కొంత కాలంగా వడ్డీ రేట్లు పెంచుతూ వస్తున్న అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మరోసారి మంగళవారం సమావేశం కానుంది.

వరుస బ్యాంకింగ్‌ పతనాల నేపథ్యంలో ఆచితూచి నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఫెడ్‌ వెలువరించే రేట్ల నిర్ణయం.. బంగారం ధరకు దిశానిర్దేశం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

 

 

Exit mobile version