Twitter vs Threads: ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్‌బర్గ్‌పై ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటీ ఉంటే బాగుంటుందని చీటింగ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదని అన్నారు. ఒక ట్వీట్‌కు రిప్లైగా మస్క్ ఈ కామెంట్ చేశారు. ట్విట్టర్ తరహాలోనే మెటా సంస్థ థ్రెడ్స్ అనే పేరుతో కొత్త యాప్‌ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. కాగా అచ్చం.. ట్విటర్‌లాగే పని చేసే ఈ థ్రెడ్స్ యాప్ మార్కెట్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే 50 లక్షల మంది ఖాతాలు తెరుచుకున్నారు. ఇది ట్విటర్‌ను ఇబ్బంది పెట్టేసింది. దానితో ఈ విషయాన్ని ట్విట్టర్ చాలా సీరియస్ గా తీసుకుంది. మెటా సంస్థకు ట్విటర్ న్యాయవాది అలెక్స్ స్పిరో ద్వారా మస్క్ నోటీసులు కూడా పంపించారు.
ఇన్‌స్టాగ్రామ్‌కు అనుబంధంగానే థ్రెడ్స్ యాప్ రిజిస్ట్రేషన్ ఉండడంతో బుధవారం థ్రెడ్‌ను ప్రారంభించగానే లక్షల మంది లాగిన్ అయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌కు సుమారు 200 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. కాగా ట్విటర్‌కు కేవలం 25 కోట్ల మంది వినియోగదారులే ఉన్నారు. థ్రెడ్ యాప్ కనుక ఎక్కువ మంది వినియోగించినట్లైతే అది ట్విటర్ ముప్పు తెచ్చిపెడుతుందని మస్క్ వాదన.
లేఖలో ఏముందంటే(Twitter vs Threads)
ఇక ట్విటర్ న్యాయవాది స్పిరో పంపిన లేఖలో.. ట్విటర్ వాణిజ్య రహస్యాలు, ఇతర అత్యంత గోప్యమైన సమాచారం తెలిసిన మాజీ ట్విటర్ ఉద్యోగులను మెటా నియమించుకుందని ఆరోపించారు. “ట్విటర్ తన మేధో సంపత్తి హక్కులను కఠినంగా అమలు చేయాలని భావిస్తోంది. ఏదైనా ట్విటర్ వ్యాపార రహస్యాలు లేదా ఇతర అత్యంత రహస్య సమాచారాన్ని ఉపయోగించడం మానేయడానికి మెటా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం” అని స్పిరో మెటాకు పంపించిన లేఖలో పేర్కొన్నారు.
ట్విటర్‌ను సొంత చేసుకున్న అనంతరం.. వింత వింత నిర్ణయాలతో యూజర్లను మస్క్ గందరగోళానికి గురి చేస్తున్నారు. వాస్తవానికి సోషల్ మీడియా వేదికల్లో ట్విటర్‌కు ఎక్కువ క్రెడిబులిటీ ఉంది. కానీ మస్క్ నిర్ణయాలతో అది కాస్త తగ్గిందని టెక్ నిపుణులు చెప్తున్నారు. ఇక తాజాగా జూకర్బర్గ్ తీసుకువచ్చిన థ్రెడ్స్ కనుక సక్సెస్ అయితే ట్విటర్ పని అయిపోయినట్లేనని అంటున్నారు. దీనితో మేల్కొన్న మస్క్ నష్ట నివారణకు పూనుకున్నారు. మెటాపై ఒత్తిడి తీసుకువచ్చి థ్రెడ్స్ యాప్ ని ఆపేయాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.