Twitter vs Microsoft: టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ తమ డేటాను అక్రమంగా ఉపయోగించుకుంటోందని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విటర్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు ట్విటర్ లేఖ రాసింది. ట్విటర్ డేటా వినియోగం విషయంలో మైక్రోసాఫ్ట్ నిబంధనలను అతిక్రమించిందని ఆ లేఖలో పేర్కొంది. పైగా అందుకు డబ్బులు కూడా చెల్లించకుండా నిరాకరిస్తోందని తెలిపింది.
సత్య నాదెళ్లకు ట్విటర్ లేఖ
నిబంధనల ప్రకారం వాడుకోవాల్సిన దాని కంటే అధిక డేటాను మైక్రోసాఫ్ట్ ఉపయోగించుకుందని ట్విటర్ లేఖలో తెలిపింది. అదే విధంగా ఎలాంటి అనుమతి లేకుండా ట్విటర్ డేటాను ప్రభుత్వ ఏజెన్సీలతో పంచుకున్నట్టు పేర్కొంది. ఇలా అనేక విధాలుగా మైక్రోసాఫ్ట్ రూల్స్ ను ఉల్లంఘించిందని ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ న్యాయవాది అలెక్స్ స్పైరో లేఖలో ఆరోపించారు.
ఆదాయం పెంచుకునేందుకే(Twitter vs Microsoft)
అయితే మెక్రోసాఫ్ట్ పై ట్విటర్ ఆరోపణలపై టెక్ నిపుణులు స్పందించారు. డేటాను వినియోగించుకుంటున్న మైక్రోసాఫ్ట్ నుంచి డబ్బులు వసూలు చేసేందుకే ట్విటర్ ఇలాంటి చర్యకు పాల్పడిందని వారు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు లాన్ మస్క్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు దివాలా తీయబోయే కంపెనీని గట్టెక్కించేందుకు మస్క్ చాలా చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ పాలసీని పరిచయం చేశారు. ఖర్చుల నియంత్రణ కోసం ఉద్యోగుల కోతలు విధించారు. ఈ క్రమంలోనే తమ డేటాను వినియోగించుకుంటున్న కంపెనీల నుంచి ఆదాయం పెంచుకోవడానికి కూడా ట్విటర్ ఇది ఒక మార్గంగా భావిస్తున్నట్టు తెలుస్తోంది.
లేఖను పరిశీలించిన తర్వాతే
గత నెలలో ఎలాన్ మస్క్.. మైక్రోసాఫ్ట్ పై బహిరంగంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మెక్రోసాఫ్ట్ వారి ఏఐ సాంకేతికతను ట్రెయిన్ చేయడానికి ట్విటర్ డేటాను అక్రమంగా ఉపయోగించుకుంటోందని ఆయన ట్వీట్ చేశారు. అయితే తాజా ఆరోపణలపై మైక్రోసాఫ్ట్ కూడా స్పందించింది. ప్రస్తుతం ట్విటర్ డేటాకు తాము ఎలాంటి చెల్లింపులు చేయడం లేదని తెలిపింది. ట్విటర్ నుంచి లేఖ అందినట్టు మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి ఫ్రాంక్ షా స్పష్టం చేశారు. లేఖను పరిశీలించిన తర్వాతే స్పందిస్తామన్నారు.