Electric vehicles: ప్రస్తుతం విద్యుత్ వాహనాలపై ఇస్తున్న సబ్సిడీకి కోత పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఫేమ్ 2 పథకం కింద 40 శాతం సబ్సిడీ అందిస్తున్నారు. అయితే ఈ పథకం కొనసాగుతుందా? లేదా? అని చాలా కాలంగా సందేహాలు నెలకొన్నాయి. దీంతో ఈవీ వాహనాల కొనుగోళ్లపై ప్రభావం పడుతోంది. కానీ తాజాగా ఈ అంశంపై భారీ పరిశ్రమ మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఒక వేళ ప్రణాళికలు నిజం అయితే ఈవీ వాహనాలపై ఇచ్చే సబ్సిడీ తగ్గడం వల్ల వాటి ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
15 శాతానికి కుదించేలా(Electric vehicles)
ప్రస్తుతం ప్రభుత్వం వాహన ధరలో గరిష్ఠంగా 40 శాతం సబ్సిడీ అందిస్తోంది. అయితే ఈ సబ్సిడీపి 15 శాతానికి కుదించాలని కేంద్రం అనుకుంటోంది. అదే విధంగా కిలోవాట్‌కు ఇస్తున్న రూ. 15 వేల సబ్సిడీని సైతం రూ.10 వేలకు తగ్గించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనివల్ల పథకం కోసం కేటాయించిన నిధులను మరిన్ని వాహనాల సబ్సిడీకి ఇచ్చేందుకు వీలు పడుతోందని కేంద్రం ఆలోచిస్తోంది. ఇప్పటి వరకు 5.63 లక్షల ఈవీ ద్విచక్ర వాహనాలు ఫేమ్ 2 పథకం కింద సబ్సిడీ పొందాయి. ఇలాగే ఇస్తూ పోతే పథకం కింద కేటాయించిన నిధులు త్వరలో అయిపోతాయని అధికారులు చెబుతున్నారు.
వాహన ధరలు పెరిగే ఛాన్స్
కాగా, సబ్సిడీలో ప్రభుత్వం కోత పెడితే.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు 3.5 KW బ్యాటరీ ఉండే ఒక విద్యుత్ వాహనం ధర రూ. 1.50 లక్షలు అయితే. . కిలోవాట్‌కు రూ. 15 వేలు చొప్పున 40 శాతం సబ్సిడీ మినహాయిస్తారు. అంటే రూ. 52,500 సబ్సిడీ రూపంలో లభిస్తుంది. అదే సబ్సిడీ మొత్తాన్ని 15 శాతానికి తగ్గించి.. కిలోవాట్‌కు రూ. 10 వేలకు తగ్గిస్తే.. రూ. 22,500 మాత్రమే సబ్సిడీ వస్తుంది. దీంతో విద్యుత్ వాహన ధరలు పెరగనున్నాయి.