Electric Scooters: ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు దారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎలక్ట్రిక్ బైక్ ల వినియోగాన్ని ప్రోత్సహించేలా కొనుగోలుదారులకు అందించే సబ్సిడీని భారీగా తగ్గించనుంది. దీంతో ఈవీ బైక్స్ ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి.
కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ.. పర్యావరణ హితమైన విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేలా ఫేమ్-2 (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ) స్కీంను ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో భాగంగా విద్యుత్ వాహనాల కొనుగోలుపై ఒక కిలో వాట్ కు రూ. 10 వేల సబ్సిడీని రూ. 15 వేలకు పెంచింది. వాహనం ఖరీదులో 20 శాతమే అందించే సబ్సిడీని సైతం 40 శాతానికి పెంచింది.
ఇప్పుడు 40 శాతం సబ్సిడీని 15 శాతానికి తగ్గిస్తూ కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇక తగ్గించిన సబ్సిడీ జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఆ నివేదికలు పేర్కొన్నాయి.
గత ఏడాదిలో 21 శాతం వృద్ధి(Electric Scooters)
గత ఏప్రిల్ నెలలో ఈవీ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరిగినట్టు జేఎంకే రిసెర్చ్ అనలటిక్స్ నివేదిక వెల్లడించింది. 21 శాతం వృద్దితో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ నెల వరకు 1,10,503 యూనిట్లు అమ్ముడు పోయినట్టు నివేదిక ఇచ్చింది.
అదే విధంగా దేశంలోని ఉత్తర్ ప్రదేశ్, మహరాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లలో మొత్తం కలుపుకొని 21,845 వెహికల్స్‌ను కొనుగోలు చేశారు. ఎక్కువ వెహికల్స్‌ను కొనుగోలు చేసిన జాబితాలో ఓలా కంపెనీ మొదటి స్థానంలో ఉండగా.. టీవీఎస్, ఎథేర్ మోటార్స్‌లు వరుస స్థానాల్లో ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బైక్‌లు, ఆటోలు, కార్లు, బస్సుల వినియోగానికి తోడ‍్పడేలా ఫేమ్ 2 పథకంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రోత్సహకాలు అందిస్తుంది. ఇందుకోసం రూ. 10,000 కోట్లను కేటాయించింది. ఏప్రిల్ 1,2019 నుంచి మూడేళ్లకాలానికి ఇది వర్తిస్తుంది. అయితే ఈ నిధులు తగ్గిపోవడం వల్లే సబ్సిడీ తగ్గించిందనే వాదనలు వినిపిస్తున్నాయి.