Prime9

Srisailam: శ్రీశైలానికి తగ్గిన వరద.. ప్రాజెక్ట్ కు వేగంగా మరమ్మతులు

Water Flow to Srisailam: నైరుతి రుతుపవనాల రాక, అరేబియా, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండాల కారణంగా మే చివరి వారంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిశాయి. ముఖ్యంగా అరేబియా తీర ప్రాంతాలైన కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో, తమిళనాడులోనూ విస్తారంగా వర్షాలు పడ్డాయి. మరోవైపు ఏపీ, తెలంగాణలోని కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వానలు పడటం వల్ల తుంగభద్ర, కృష్ణా నదిలోకి వరద ప్రవాహం మొదలైంది. దీంతో ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చిన వరదతో ప్రాజెక్టుల్లోకి కొంత నీరు చేరింది. తాజాగా కృష్ణా బేసిన్ లో వర్షాలు తగ్గిపోవడంతో కృష్ణానదికి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది.

 

అయితే ఎగువన కురిసిన వర్షాలతో తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతోంది. ముఖ్యంగా ఇవాళ ఉదయానికి నదిలోకి ఇన్ ఫ్లో 8692 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 362 క్యూసెక్కులుగా ఉంది. తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా.. ప్రస్తుతం 1600 అడుగుల వద్ద నీటిమట్టం నమోదైంది. వరద ప్రభావం ఇలాగే కొనసాగితే రెండు రోజుల్లో గేట్లు ఎత్తే పరిస్థితి వస్తుందని అధికారులు చెప్పారు.

 

ఇక శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. ఎగువన జూరాల జలాశయం గేట్లు మూసివేయడం, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో వరద ప్రవాహం కొనసాగడం లేదు. దీంతో అధికారులు శ్రీశైలం జలాశయానికి చేస్తున్న మరమ్మతు పనుల్లో వేగం పెంచారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 836 అడుగులు వద్ద నీరు నిల్వ ఉంది.

Exit mobile version
Skip to toolbar