Prime9

Jawan Murali Nayak Final Ritual: నేడు జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు, పవన్ కళ్యాణ్ హాజరు

Pawan Kalyan at Jawan Murali Nayak Final Ritual: జ‌మ్మూక‌శ్మీర్‌లో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ నివాళులు అర్పించనున్నారు. కాసేపట్లో మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడనుంచి 8.30 గంటలకు పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. మురళినాయక్ స్వగ్రామం కల్లితాండాకు చేరుకొని అతని పార్థివదేహానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం 11.00 గంటలకు పుట్టపర్తి ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళతారు. మురళీ నాయక్‌ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి.

 

భారత్-పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ భౌతికకాయం సొంతూరికి చేరింది. భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు అతడి ఇంటికి చేర్చారు. మురళీ భౌతికకాయాన్ని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని గడ్డంతాండ పంచాయతీ కల్లితాండాకు ఆర్మీ అధికారులు తీసుకొచ్చారు. కుమారుడి మృతదేహం చూసి మురళీ తల్లిదండ్రులు బోరున ఏడుస్తున్నారు. మురళీ భౌతికకాయంను చూసేందుకు స్థానికులు భారీగా వచ్చారు.

 

చేతిలో మువ్వన్నెల జెండా పట్టుకుని ‘భారత మాతకు జై’, ‘జై జవాన్’, ‘మురళీ నాయక్ అమర్ రహ హే’ అంటూ నినాదాలు చేశారు. పోలీసు బందోబస్తు నడుమ మురళీ భౌతికకాయాన్ని ప్రజల సందర్శన కోసం అధికారులు ఉంచారు. స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో మురళీ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మురళీ పార్థివదేహాన్ని బెంగళూరు నుంచి కల్లితండాకు తీసుకొస్తున్న సమయంలోనూ రోడ్డు పొడవునా జనాలు జననీరాజనం పట్టారు.

Exit mobile version
Skip to toolbar