Soaring Veggie Prices: జంట నగరాల ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలు పెరిగిపోతున్న కూరగాయల ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా నిర్వహించిన సర్వేలో రాష్ర్ట జనాభాలో 50 శాతం మంది ప్రజలు పెరిగిన కూరగాయల ధరలతో ఇబ్బందులు పడుతున్నారని తేల్చింది. 70 శాతం మంది ప్రజలు కూరగాయాల వినియోగాన్ని తగ్గించుకున్నారు. కూరగాయలు ముఖ్యంగా టమోటాలు, ఉల్లి, బంగాళదుంపల ధరలు కిలో రూ.50 దాటితేనే ప్రజలు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం టమోటలు కిలో రూ.100 దాటిపోయింది. దీంతో రాష్ర్టంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రూ100 కు చేరిన కిలో టమాటా ధర..(Soaring Veggie Prices)
పెరిగిన కూరగాయల ధరలతో ప్రతి ఇద్దరిలో ఒకరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తాజా సర్వే తేల్చి చెప్పింది. ఈ నెల 1 నుంచి 17 వరకు లోకల్ సర్కిల్స్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని తేల్చి చెప్పింది. ముఖ్యంగా టమోటాలు గత మూడు నాలుగు రోజుల నుంచి బాగా పెరిగాయని వెల్లడించింది. కిలో రూ. 40 ఉన్న టమోటో రిటైల్ మార్కెట్‌లో కాస్తా రూ.100 మార్కుకు చేరింది. గతంలో వారానికి రెండు లేదా మూడు కిలోల వాడే కుటుంబాలు ప్రస్తుతం కిలోకే పరిమితం కావాల్సి వచ్చిందని సర్వేలో పాల్గొన్న వారు చెప్పారు. ఇంటి బడ్జెట్‌లో కూరగాయల వాటా పెరిగిందని గృహిణులు వాపోతున్నారు.
కాగా సర్వేలో మొత్తం 3,626 మంది పాల్గొన్నారు. వీరిలో చాలా మంది కిలో రూ.30 కంటే తక్కువ ఉంటే సౌకర్యం వంతంగా ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రస్తుత పరిస్థితితో జనాభాలో 50 శాతం మందికి కూరగాయల ధరల సెగ తాకిందని చెబుతున్నారు. కిలో రూ.30 దాటిందంటే పేదలు, మధ్య తరగతి ప్రజలు కూరగాయలు కొనలేని పరిస్థితికి చేరుకుంటారని సర్వేలో పాల్గొన్న ప్రజలు చెప్పారు.
ఇక వేళ కూరగాయలు కిలో రూ.50 దాటిందంటే మెజారిటి ప్రజలు కొనలేని స్థితికి చేరుకుంటారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇదే పరిస్థితి కనిపించింది. అప్పుడు కిలో టమాటా రూ.160 పలికింది. అయితే ఈ సారి మాత్రం మూడు నెలల ముందే ఈ పరిస్థితి వచ్చింది. సాధారణంగా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు కూరగాయల ధరలు పెరుగుతాయి.. అటు తర్వాత నుంచి క్రమంగా తగ్గముఖం పడతాయి. అయితే ఇలా నిత్యావసర సరకుల ధరలు పెరగడం కేవలం హైదరాబాద్, తెలంగాణకు మాత్రమేకాకుండా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం అకాల వర్షాలతో పాటు సరఫరాకు ఆటంకం కలగడం… రవాణా వ్యయం పెరగడం కూడా ఒక కారణమని హోల్‌సేల్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.