Karnataka Sex scandal:కర్ణాటకలో ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ దుమారం చెలరేగుతోంది. దీనికంతటికి కారణం మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవగౌడ్ మనవడు ప్రజ్వల్ రెవన్న సెక్స్ స్కాండిల్‌లో కూరుకుపోవడమే. ప్రజ్వల్ అసభ్యకరమైన క్లిప్స్ ప్రస్తుతం కర్నాటకలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి. దీంతో పాటు ఓ మహిళ కూడా జెడి ఎస్ నాయకుడు ప్రజ్వల్ తండ్రి హెచ్‌డీ రెవన్న తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసు ఫిర్యాదు చేశారు. దీంతో సిద్దరామయ్య ప్రభుత్వం వెంటనే సిట్‌ను ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది.
గత శుక్రవారం నాడు కర్ణాటక లోకసభ ఎన్నికలు ముగిసిన వెంటనే , జెడీఎస్‌కు కష్టాలు మొదలయ్యాయి. హోలెనరసిపుర పట్టణానికి చెందిన ఓ మహిళ ఆదివారం నాడు జెడీ ఎస్ నాయకుడు ప్రజ్వల్ రేవన్నకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెవెన్న తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం లైంగిక దాడికి సంబంధించి సిట్‌ను నియమించి విచారణకు ఆదేశించింది. ఇంతకు ఈ కేసు ఏమిటి.. ప్రజ్వల్‌పై వచ్చిన ఆరోపణలు ఏమిటో చూద్దాం. కర్ణాటకలోని హసన్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రజ్వల్ పోటీ చేశాడు. కాగా కర్ణాటకలో ఈ నెల 26న పోలింగ్ ముగిసింది. అయితే పోలింగ్‌కు మూడు రోజుల ముందు ప్రజ్వల్ మహిళలపై దాడి చేయడమే కాకుండా వారిని తనతో సెక్స్‌లో పాల్గొనాలని బలవంతం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌లు వైరల్ అయ్యాయి. కాగా వీడియోలు హసన్ లేదా హోలెనరిసిపురలో షూట్ చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కాగా ఈ వీడియోలు ఒక వైపు దుమారం రేపుతుంటే మరో పక్క హోలేనరిసిపుర్‌లో ఒక మహిళ ప్రజ్వల్ రెవన్నకు, ఆయన తండ్రికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి కొడుకులు ఇద్దరు తనను లైంగికంగా వేధించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను కూడా ప్రజ్వల్ వీడియోలను చూసిన తర్వాత తండ్రి, కొడుకు చేతిలో పడ్డ నరకయాతన గురించి పోలీసులకు చెప్పాలని వచ్చానని ఆమె తెలిపారు.
ప్రజ్వల్ ను చూస్తే హడల్..(Karnataka Sex scandal)
ఇక హోలె నరసిపూర్‌కు చెందిన మహిళ ఫిర్యాదు విషయానికి వస్తే 2019 నుంచి 2022 వరకు వారి చేతిలోతాను పలుమార్లు లైంగిక దాడులకు గురయ్యానని పోలీసులకు తెలిపారు. తాను రెవన్న భార్య భవానికి చుట్టమని, 2011లో తనను వారింట్లో పనిచేయడానికి ఆహ్వానించారని చెప్పారు. అయితే 2015లో రెవన్న తనకు ఓ హాస్టల్‌లో వంట మనిషి ఉద్యోగం ఇప్పించారని గుర్తు చేశారు. అటు తర్వాత 2019లో తిరిగి తాను రెవన్న ఇంట్లో పనికి కుదిరానని వివరించారు. తాను ఒక్కదాన్నే కాదని.. ఇంట్లో మరో ఆరుగురు పని మనిషులున్నామన్నారు. తామంతా ప్రజల్వ్‌ను చూస్తే వణికిపోయే వారమని చెప్పారు. అయితే రెవన్న ఇంట్లో పనిచేసే మగ పనివారు కూడా రెవన్నతో పాటు ప్రజ్వల్‌తో జాగ్రత్తగా ఉండాలని తరచూ హెచ్చరిస్తూ ఉండేవారని చెప్పేవారు.అయితే రెవెన్న భార్య భవాని ఇంటి నుంచి బయట వెళ్లినప్పుడు రెవన్న తనను తాకరాని చోట్ల తాకేవాడని, తన దుస్తులు విప్పేవాడని, తనపై లైంగిక దాడి చేసేవాడని ఆమె చెప్పుకొచ్చారు. ఇక తాను కిచెన్‌లో పనిచేస్తున్నప్పుడు ప్రజ్వల్ వెనుక నుంచి వచ్చి తాకరాని చోట్ల తాకేవాడని చెప్పుకొచ్చారు. అయితే ఇంట్లో పనిచేస్తున్న ఉద్యోగులతో తన కుమార్తెను రప్పించి తనకు ఆయిల్ మసాజ్ చేయించిలని ఒత్తిడి చేసేవాడు. ప్రజ్వల్ తన కుమార్తెతో వీడియో కాల్‌లో అసభ్యకరంగా మాట్లాడేవాడని ఆమె చెప్పారు. కాగా ఈ మహిళ చెప్పిన అంశాలను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. తండ్రి, కొడుకుల వేధింపులు తట్టుకోలేక ..మానసికంగా కంగిపోయి ఉద్యోగం మానేసి, రెవన్న ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశానని చెప్పారు బాధిత మహిళ.
పలు సెక్షన్ల కింద కేసు నమోదు..
బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లైంగి వేధింపులు, లైంగిక దాడి, బెదిరింపులు, అసభ్యకర సంజ్ఞలు చేయడం,మహిళలను అవమానించడం లాంటి కేసులు వీరిపై నమోదు అయ్యాయి. ఎఫ్‌ఐఆర్‌లో రెవన్నను ప్రధమ నిందితుడగా.. ప్రజ్వల్‌ను రెండవ నిందితుడుగా చేర్చారు. బాధిత మహిళ ఫిర్యాదు చేసిన వెంటనే శనివారం నాడు సిద్దరామయ్య ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ కేసు రాష్ర్టం మొత్తం పెద్ద దుమారమే రేపిందని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా ప్రజ్వల్ అసభ్యకర వీడియోలు హసన్‌లో పెద్ద ఎత్తున దుమారం రేపాయి. హసన్‌లోనే మహిళలపై లైంగిక దాడి జరిగిందని అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా మహిళా కమిషన్ చైరపర్సన్ ప్రభుత్వానికి ఒ లేఖ రాసి దీనిపై సిట్‌తో దర్యాప్తు చేయించాలని కోరారు. మహిళా కమిషన్ విన్నపాన్ని దృష్టిలో ఉంచుకొని సిట్ ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం.
ఇవన్నీ ఒక ఎత్తయితే ఈ సెక్స్ స్కాండిల్ కాస్తా పెద్ద రాజకీయ దుమారంగా మారింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకె శివకుమార్ కూడా స్పందించారు. లోకసభ ఎన్నికల్లో బీజేపీ, జెడీఎస్ కలిసి పోటీ చేశాయి. ప్రస్తుతం ఈ లైంగిక వేధింపుల కేసుపై ఇరు పార్టీలు వివరణ ఇవ్వాలని డిమండ్ చేశారు. ప్రధానమంత్రి, బీవై విజయేంద్ర, శోభక్క, అశోక్, కుమారన్న, అశ్వత్ నారాయణ ప్రజలకు దీనికి సంబంధించి జవాబివ్వాలని డీకె శివకుమార్ కోరారు. ఇదిలా ఉండగా ఈ వివాదం నుంచి బీజేపీ దూరంగా జరిగింది. ప్రస్తుతం జెడీ ఎస్ నష్టనివారణ చర్యలు చేపట్టింది. కాగా బీజేపీ అధికార ప్రతినిధి ఎస్ ప్రకాశ్ మాట్లాడుతూ.. రాజకీయ పార్టీగా ఈ వీడియోలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, దీని గురించి తాము వ్యాఖ్యానించాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేశారు.
ఫ్రాంక్ ఫర్డ్ పారిపోయిన ప్రజ్వల్ ..
తాజా పరిణామాలపై ప్రజ్వల్ చిన్నాన్న హెచ్‌డీ కుమారస్వామి కూడా స్పందించారు. హెచ్‌డీ దేవగడకు మహిళలంటే అత్యంత గౌరవమని అన్నారు. వారి కష్టాలను నెరవేర్చేవాడని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కాబట్టి విచారణలో ఏం తేలుతుందో చూద్దాం అని వేదాంత ధోరణిలో అన్నారు. ఎవరు తప్పు చేసినా దానికి ఫలితం అనుభవించాల్సిందేనన్నారు. అయితే తప్పు ఎవరు చేసినా క్షమించేది లేదన్నారు. సిట్ నివేదిక రానీయండి. తర్వాత తాను వ్యాఖ్యానిస్తానని కుమారస్వామి ఆదివారం అన్నారు. అయితే జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ప్రజ్వల్ ఫ్రాంక్ ఫర్ట్ పారిపోయారని పెద్ద ఎత్తున కథనాలు వినవస్తున్నాయి. అయితే తాను అమాయకుడినని.. ఈ వీడియోలన్నీ మర్ఫింగ్ అని… 2024 లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున తన ఇమేజ్ డ్యామేజీ చేసేందుకే ఈ వీడియోలు విడుదల చేశారని ప్రజ్వల్ ప్రత్యారోపణలు చేస్తున్నారు.
అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే .. కర్ణాటక హసన్‌కు చెందిన బీజేపీ నాయకుడు .. ప్రజ్వల్ రేవన్న మహిళలను లైంగికంగా వేధిస్తున్నాడని, గత ఏడాది డిసెంబర్ 8న బీజేపీ ప్రెసిడెంట్ బీవై విజయేంద్రన్‌కు లేఖ రాశారు. ప్రజ్వల్‌ను హసన్ నుంచి లోకసభకు పోటీకి నిలబెట్టవద్దని సలహా కూడా ఇచ్చారు. రెవెన్నకు సంబంధించి 2,976 వీడియోలు, ఫోటోలు మహిళలతో ఆయన సెక్స్‌లో పాల్గొన్న వీడియోలు పెన్ డ్రైవ్‌లో పంపించారని చెబుతున్నారు. ప్రజ్వల్ పలువురు ప్రభుత్వ ఉన్నాధికారులతో కూడా సెక్స్‌లో పాల్గొన్నాడని… అటు తర్వాత వారిని బ్లాక్‌మెయిల్ చేసి తన లైంగిక వాంఛలను తీర్చుకొనే వాడు. కాగా ఈ పెన్ డ్రైవ్‌లోని వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం జాతీయ నాయకుల చేతికి చిక్కాయి. వారిలో కాంగ్రెస్ నాయకులకు కూడా అందాయి. ప్రస్తుతం బీజేపీ- జెడీ ఎస్‌లు కలిసి కర్ణాటకలో పోటీ చేశాయి. మరి వీరి హనీమూన్ కొనసాగుతుందా లేదా అనేది జూన్ 4వ తేదీ తర్వానే తెలుస్తోంది.