Site icon Prime9

చిన్నారిని ఫస్ట్ ఫ్లోర్ నుంచి విసిరేసిన స్కూల్ టీచర్…

teacher thrown away girl from first floor in delhi

teacher thrown away girl from first floor in delhi

Viral News : దేశ రాజధాని ఢిల్లీలో ఐదో తరగతి చదువుతున్న బాలికను… టీచర్ ఫస్ట్ ప్లోర్ కిటికీ నుంచి కిందకు విసిరేసిన ఘటన అందరిని షాక్ కి గురి చేస్తుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరగగా… ప్రస్తుతం ఆ విద్యార్ధిని పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందుతుంది. ఈ ఘటన ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయం గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఢిల్లీ నగర్ నిగమ్ బాలికా విద్యాలయంలో వందన అనే అమ్మాయి 5వ తరగతి చదువుతోంది. ఆ చిన్నారి వయస్సు 9 సంవత్సరాలు.

కాగా శుక్రవారం నాడు యధావిధి గానే వందన స్కూల్ కి వచ్చింది. ఉదయం 11 సమయంలో క్లాస్ చెప్పేందుకు ఉపాధ్యాయిని గీతా దేశ్వాల్ వచ్చింది. అయితే ఆ తర్వాత అకస్మాత్తుగా టీచర్ గీత ఆవేశంతో వందనను మొదటి అంతస్తులో ఉన్న క్లాస్‌రూమ్‌ కిటికీలో నుంచి కిందకి విసిరేసింది. అలా విసిరేయడానికి ముందు చిన్నారిపై కత్తెరతో కూడా దాడి చేసినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. అయితే చిన్నారి వందనపై టీచర్ గీత ఆగ్రహంతో దాడి చేస్తున్న దృశ్యాలను మరో టీచర్ రియా గమనించి ఆమెను ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ఈలోపే ఆమె చిన్నారిని కిటికీ నుంచి విసిరేసింది.

ఇక బాలిక మొదటి అంతస్తు నుంచి కిందపడటం చూసిన వారంతా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్కూల్ సిబ్బంది తీవ్రంగా గాయపడిన చిన్నారిని బారా హిందూరావు ఆసుపత్రికి తరలించారు. చిన్నారికి అన్ని పరీక్షలు నిర్వహించామని… చికిత్సకు స్పందిస్తోందని వైద్యులు తెలిపారు. బాలిక చికిత్సకు అయ్యే ఖర్చు అంతా తామే భరిస్తామని ఢిల్లీ నగర పాలక సంస్థ హామీ ఇచ్చింది. మరోవైపు ఈ ఘటనపై స్కూలు వద్ద స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. చిన్నారి వందనను విసిరేసిన ఉపాధ్యాయురాలు గీతను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Exit mobile version