Corona : కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. చైనా, పలు దేశాలలో ఇప్పటికే మరణాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ తరుణంలోనే మళ్ళీ దేశాలన్నీ అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనిపిస్తుంది. కాగా ఇటీవల విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన వారిలో 124 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.
అయితే వీరిలో మొత్తం 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లను గుర్తించినట్లు కేంద్రం ప్రభుత్వం తెలిపింది. గత 11 రోజుల వ్యవధిలో చైనా సహా పలు దేశాల నుంచి భారతదేశానికి 19,227 మంది ప్రయాణీకులు వచ్చారని కేంద్రం తెలిపింది. డిసెంబర్ 23 నుంచి జనవరి 3 మధ్య వీరందరికీ దేశంలోని విమానాశ్రయాలు, ఓడరేవులు, ల్యాండ్ పోర్ట్‌లలో స్క్రీనింగ్ నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.
చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణీకులు తప్పనిసరిగా కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్లు సమర్పించాలని ఇప్పటికే నిబంధన విధించినట్లు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులు, పోర్టులలో స్క్రీనింగ్ నిర్వహిస్తోంది. దేశంలో కోవిడ్ సంసిద్ధతను సమీక్షించేందుకు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించింది.