Sailing Stones Death Valley: ఈ సృష్టిలో అంతుచిక్కని అద్భుతాలెన్నో ఉన్నాయి. కాగా అలాంటి వాటికోవకే చెందుతుంది ఈ డెత్ వ్యాలీ. సాధారణంగా ఎవరైనా చలనం లేకుండా ఉంటే ఏంటి రాయిలా కదలకుండా ఉన్నావు అంటారు. కానీ అది తప్పు అంటాను నేను ఎందుకంటే ఈ డెత్ వ్యాలీలో రాళ్లు స్వయంగా కదులుతాయి. ఒకచోటి నుంచి ఇంకొక చోటికి ప్రయాణిస్తాయి. అందేటీ రాళ్లు కదలడం ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ కథనం చదివెయ్యండి.
రాళ్లూ చలించగలవు..
ఈ సృష్టిలో ప్రాణమున్న జీవి మాత్రమే స్వయంగా కదల గలదని, ఒక చోటు నుంచి మరో ప్రాంతానికి ప్రయాణిస్తుంది. కానీ, జీవం లేని ఓ రాయి ముందుకు నడుస్తుంది అంటే మీరేమంటారు. “ఇది అసాధ్యం” అంటారా? కానీ నిజమండీ. నమ్మండి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న పానామింట్ అనే పర్వతాలకు సమీపంలో ఓ డెత్ వ్యాలీ ప్రదేశం ఉంది. ఇక్కడ ఒక్క మనిషి కూడా ఉండడు. కానీ, రాళ్లు మాత్రం ప్రాణం ఉన్న జీవుల్లా వాటంతట అవే కదులుతాయి. వీటిని సెయిలింగ్ స్టోన్స్, స్లైడింగ్ రాక్స్, మూవింగ్ రాక్స్ అంటూ రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇక ఈ రాళ్లు ఒక్కొక్కటీ కనీసం 3 క్వింటాళ్లకు పైనే బరువు ఉంటాయి.
సడెన్ ట్విస్ట్..
ఇదిలా ఉండాగా మరో ట్విస్ట్ కూడా ఉందండోయ్ ఈ రాళ్లు కొంత దూరం వెళ్లిన తర్వాత, ఉన్నట్టుండి దిశను మార్చుకుంటాయట. అంటే తూర్పు నుంచి పడమరకు వెళ్తున్న రాయి, ఉత్తరానికో, దక్షిణానికో తిరుగుతుంది. మరికొన్ని రాళ్లయితే సడన్ గా ఆగిపోయి, యూటర్న్ తీసుకుంటాయట. ఈ విషయాన్ని ఆ రాళ్ల చారలే మనకు తెలుపుతాయి. ఇది చూసిన సమీప ప్రాంతప్రజలు భయపడి అక్కడేవో అతీంద్రియ శక్తులు ఉన్నాయని అందుకే రాళ్లు కదులుతున్నాయని భావించేవారు. అందుకే ఆ ప్రాంతంలో ఏ ఒక్క మానవ మాత్రులు ఉండరు.
శాస్త్రవేత్తలు చెప్తుదేంటి..
ఇంక ఇక్కడి విషయం తెలుసుకున్న శాస్త్రవేత్తలు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు పరిశోధనలు చేపట్టారు. 1915లో అమెరికా చెందిన జోసెఫ్ క్రూక్, ఆ తర్వాత 1948లో భూ శాస్త్రవేత్తలు మెక్ అలిస్టర్, అలెన్ పరిశోధించి, నమ్మలేని విషయం చెప్పారు. ఈ రాళ్లు కదలడానికి గాలి కారణమని అన్నారు. వీరి సిద్దాంతాన్ని అందరూ కొట్టి పారేశారు. కాగా 1970లో బాబ్ షార్ప్, డ్వైట్ కారీ మే మరో ప్లాన్ తో ఆ ప్రాంతంలోని మొత్తం 30 రాళ్లకు గుర్తులు వేశారు. ప్రతి రాయికీ ఒక్కో పేరు పెట్టారు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా గుర్తులు గీశారు. అప్పటి నుంచి ఏకంగా 7 సంవత్సరాల పాటు వాటి కదలికను నోట్ చేశారు. అయితే మొత్తం 30 రాళ్లలో 2 తప్ప, మిగిలిన 28 రాళ్లు అవి ఉన్న స్థానం నుంచి ముందుకు కదిలాయని, అయితే ఇవన్నీ కూడా ఒకేసారి కదల్లేదని వెల్లడించారు. ఇందులో కొన్ని రాళ్లు మొదటి సంవత్సరం చలికాలంలో, మరికొన్ని రెండో సంవత్సరం చలికాలంలో, మిగిలినవి మూడో ఏడాది చలికాలంలో కదిలాయని వారు గుర్తించారు. వేసవి కాలంలో మాత్రం ఏ ఒక్క రాయి కూడా కదల్లేని వాళ్లు గీసిన హద్దుల ద్వారా నిర్ధారించారు. కాగా ఆ డెత్ వ్యాలీ ప్రాంతమంతా వర్షాకాలంలో ఒక నీటి సరస్సుగా మారుతుందని, ఆ తర్వాత చలికాలం వచ్చే నాటికి కొద్ది కొద్దిగా నీళ్లు తగ్గిపోతూ ఉన్న కొద్దిపాటి నీళ్లు గడ్డకట్టిపోయి మంచు పలకలా తయారవుతుందని తెలిపారు. అయితే అప్పుడు వీచే బలమైన గాలుల కారణంగా రాళ్లు ఐస్ పలకలమీద నుంచి ముందుకు జారుతున్నట్టు పేర్కొన్నారు. ఎండా కాలంలో మంచు ఉండదు కాబట్టి, అప్పుడు రాళ్లు కదలట్లేదని వారు వెల్లడించారు.
మంచు పలకలు, బలమైన గాలులే ఈ రాళ్ల కదలికలకు కారణమైతే, అన్ని రాళ్లు కదాలాలి కదా. కొన్ని రాళ్లు అసలు కదలకపోవడం ఏంటి, అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా రాళ్లు ప్రయాణిస్తూ మధ్యలో దిశ మార్చుకోవడం ఏంటీ, మూడేళ్లకోసారి మాత్రమే కొన్ని రాళ్లు కదలడం ఏంటి అని అడుగుతున్నారు. ఇలా ఓ వైపు శాస్త్రవేత్తలు మరోవైపు సందేహాలతో ఈ డెత్ వ్యాలీ ఓ మిస్టరీగా మిగిలిపోయిందనే చెప్పవచ్చు.
ఇదీ చదవండి: Rainbow River: విశ్వసుందరి కిరీటం ఆ నది సొంతం.. ఎందుకో తెలుసా..!