Gaddar Film Awards 2025: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమం నేడు(శనివారం) హైటెక్స్‌లో వైభవంగా జరగనుంది. కొన్నేళ్లుగా సర్కారు నుంచి తెలుగు సినిమా అవార్డుల కార్యక్రమం జరగలేదు. దీంతో కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించేందుకు తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలకు, 2024 ఏడాదికి అన్ని విభాగాలకు గద్దర్ ఫిల్మ్ అవార్డులను అందజేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు, చలనచిత్ర రంగ ప్రముఖులు పాల్గొననున్నారు.
ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష..
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన సన్నాహాకాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం తెలంగాణ సచివాలయం నుంచి ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమం విజయవంతంగా కొనసాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ సూచించారు. సినీ రంగం నుంచి ప్రముఖులు వస్తున్నందున పార్కింగ్, ఇతర భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.