Minister Uttam Kumar Reddy : బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని, త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టుపై మంత్రి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మంత్రి చిట్‌చాట్ నిర్వహించారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేశామని తెలిపారు. ఇంకా ఏమి ప్రయత్నాలు చేయాలో చేస్తామని పేర్కొన్నారు. రెండు రోజుల్లో మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. తమ అభ్యంతరాలను చెప్పామన్నారు. బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లో తాము ఒప్పుకోబోమని, త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.
బనకచర్లపై ఏపీ ప్రభుత్వం కేంద్రం ముందుకు ప్రతిపాదనలు తీసుకెళ్లనుంది. పోలవరం ప్రాజెక్టును నుంచి బనకచర్లకు నీటి తరలింపు ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖకు రాష్ట్ర అధికారులు పూర్తి వివరాలు అందించనున్నారు. రూ.81 వేల కోట్లతో ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ప్రాజెక్టుతో రైతులు, ప్రజలకు కలిగే ప్రయోజనాలను ప్రజెంటేషన్ ద్వారా ఆర్థిక, నీటిపారుదల శాఖ అధికారులు వివరించనున్నారు. గత నెలలో జరిగిన భేటీల్లో ప్రాజెక్టు ప్రతిపాదనలను ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై పూర్తి వివరాలు ఇవ్వాలని గతంలో కేంద్ర ఆర్థికశాఖ కోరగా, ఇవాళ అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.