Balmuri Venkat Filed a case on BRS Working President KTR: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం మరో కేసు బనాయించింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బల్మూరి వెంకట్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఫార్ములా ఈ-కార్ రేసులో ఏసీబీ నోటీసులు..
ఫార్ములా ఈ-కార్ రేసులో కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 16న విచారణకు రావాలని కోరింది. మే 28న కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు పంపింది. తనకు ముందుగానే యూకే, యూఎస్‌ఏలో పలు కార్యక్రమాలకు వెళ్లే ఏర్పాట్లు ఉన్నాయని, తిరిగి వచ్చిన తర్వాత ఏసీబీ ఎదుట హాజరవుతానని రాతపూర్వకంగా తెలియజేశారు. ఇదే కేసులో ఈ ఏడాది జనవరి 3వ తేదీన ఏసీబీ నోటీసులు ఇచ్చి, అదే నెల 6వ తేదీన విచారణకు పిలిచింది. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా కేటీఆర్ ఏసీబీ విచారణకు న్యాయవాదితో జనవరి 6వ తేదీ హాజరైతే, న్యాయవాదితో విచారణకు రానివ్వమని ఏసీబీ చెప్పింది. దీంతో కేటీఆర్ ఏసీబీ గేటు బయట లిఖితపూర్వకంగా తన సమాధానం రాసి ఇచ్చారు.
తర్వాత జనవరి 7వ తేదీన హాజరు కావాలని ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. అప్పటికే హైకోర్టులో కేసు నడుస్తుండటంతో కేసు తేలే వరకు రానని కేటీఆర్ తేల్చి చెప్పారు. దీంతో జనవరి 8వ తేదీన ఇచ్చిన నోటీసుల్లో 9న హాజరుకావాలని కోరింది. జనవరి 9వ తేదీన ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. 7 గంటల్లో 82 ప్రశ్నలు అడిగారు. ఇదే కేసులో ఈడీ కేటీఆర్‌ను జనవరి 16వ తేదీన విచారణకు పిలిచింది. జనవరి 16వ తేదీన ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఈడీ అధికారులు 40 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.