CM Revanth Reddy : రాజకీయాల్లో వాజ్‌పేయికి ఉన్న గౌరవం బండారు దత్తాత్రేయకు ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణలో పాల్గొని సీఎం మాట్లాడారు. దత్తాత్రేయ ప్రజల మనిషి అని కొనియాడారు. ఆయన ఏ పదవి చేపట్టినా సరైన న్యాయం చేశారని వ్యాఖ్యానించారు.
గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్ వరకు ఆయనది సుదీర్ఘ ప్రయాణమన్నారు. దత్తన్న జీవితంలో ఎన్నో పదవులు చేపట్టినా ఎప్పుడూ ప్రజలకు దూరం కాలేదన్నారు. దత్తాత్రేయతో వ్యక్తిగతంగా తనకు చాలా సన్నిహితం ఉందన్నారు. ఆయన్ను తను చాలా దగ్గరగా చూశారని పేర్కొన్నారు. అజాత శత్రువు అనే పదం దత్తాత్రేయకు సరిగ్గా సరిపోతుందన్నారు. దేశస్థాయిలో అటల్ వాజ్‌పేయిలా రాష్ట్రంలో మనకు దత్తన్న ఉన్నారని గుర్తుచేశారు. పదవిలో ఉన్నా లేకున్నా తెలంగాణలో దత్తాత్రేయను రాజకీయాలకు అతీతంగా గౌరవిస్తారని సీఎం వ్యాఖ్యానించారు.
రాజకీయాలకు అతీతంగా దత్తాత్రేయ నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి అందరూ హాజరవుతారని తెలిపారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారు దత్తన్న నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. జంటనగరాల్లో పేదలకు కష్టం వచ్చినపుడు గుర్తొచ్చేది ఇద్దరే నాయకులు అన్నారు. పీజేఆర్, దత్తాత్రేయ అన్నారు. తాము తీసుకునే నిర్ణయాల్లో పీజేఆర్, దత్తాత్రేయ స్ఫూర్తి కచ్చితంగా పాటిస్తామని సీఎం చెప్పుకొచ్చారు.