TCS Women: దిగ్గజ టెక్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఎక్కువగా మహిళలే కంపెనీని వీడుతున్నట్టు తేలింది. ఈ విషయాన్ని టీసీఎస్ వెల్లడించింది. ఎంప్లాయిస్ కు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని తీసివేయడమే ఇందుకు కారణం కావచ్చని కంపెనీ అభిప్రాయ పడింది. సాధారణంగా మగవాళ్లతో పోల్చితే మహిళా ఉద్యోగుల వలసలు రేటు తక్కువగా ఉండేదని.. అది ఇప్పుడు మగవాళ్లకు మించి వలసల రేటు నమోదు అవుతోందని టీసీఎస్ మానవ వనరుల అధికారి మిలింద్ తెలిపారు. టీసీఎస్ లో మొత్తం 6 లక్షల మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. వారిలో 35 శాతం మహిళా ఉద్యోగులున్నారు.
వర్క్ ఫ్రమ్ హొమ్ ముగింపుతో(TCS Women)
కరోనా సంక్షోభంలో వర్క్ ఫ్రమ్ హొమ్ విధానం కారణంగా కొంత మంది మహిళలకు ఇంటి నుంచి వసతుల విషయంలో మార్పు వచ్చి ఉండొచ్చని.. అందువల్లే వారు తిరిగి కార్యాలయాలకు రాలేకపోతున్నరేమోనని మిలింద్ అభిప్రాయ పడ్డారు. ఓవరాల్ గా సిబ్బంది వలసల రేటు గత ఆర్థిక సంవత్సరం మధ్యలో గరిష్ట స్థాయికి చేరగా.. మార్చి చివరి నాటికి అది 20 శాతానికి దిగి వచ్చిందన్నారు. నాయకత్తవ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టడం వల్ల.. లీడర్ స్థానాల్లోకి మరింత మంది మహిళలు వస్తారన్నారు.
తిరిగి చేరేందుకు ఆసక్తి(TCS Women)
ఇప్పటి వరకు 22 విడతలుగా శిక్షణ ఇచ్చామని.. దాని ద్వారా 1,450 మంది మహిళా ఉద్యోగులు లబ్ధి పొందారన్నారు. 2022-23 లో టీసీఎస్ నికర నియామకాల్లో మహిళలు 38.1 శాతం వరకు ఉంటారని ఆయన తెలిపారు. అనుభవం ఉన్న మహిళా నిపుణులు, విరామం తీసుకుని తిరిగి ఉద్యోగంలో చేరేందుకు చేపట్టిన ‘రీబిగిన్’ కార్యక్రమానికి 2022-23 లో సుమారు 14 వేల ఉద్యోగ దరఖాస్తులు వచ్చాయి. అదే విధంగా ఉన్నత యాజమాన్య విభాగంలో సుమారు 30 వేల మంది ఉద్యోగులు ఉండగా.. వీళ్లలో మహిళలు 13 శాతంగా ఉంటారని నివేదిక తెలిపింది.