Reliance: దేశీయ ఈ కామర్స్ రంగంలో ప్రముఖ కంపెనీ రిలయన్స్ దూసుకుపోతోంది. సుమారు రూ. 12.30 లక్షల కోట్ల దేశీయ ఈ కామర్స్ రంగంలో దిగ్గజ సంస్థలు అమెజాన్, వాల్ మార్ట్ కంటే రిలయన్స్ ముందుందని పేర్కొంది. ఈ విషయాన్ని బెర్న్ స్టీన్ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. అతి పెద్ద రిటైల్ నెట్ వర్క్, టెలికాం కార్యకలాపాలు, బలమైన డిజిటల్ మీడియా లాంటివి రిలయన్స్ సంస్థను ముందుకు నడిపిస్తాయని ఆ నివేదిక తెలిపింది. భారత్ లో అమెజాన్, రిలయన్స్, వాల్ మార్ట్ ల మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందని చెప్పింది. సంప్రదాయ రిటైల్ వ్యాపార నమూనా ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించింది.
అమెజాన్, వాల్‌మార్ట్ లకు గట్టి పోటీ(Reliance)
దేశీయంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అతి పెద్ద డిజిటల్ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోంది. దీని అనుబంధ సంస్థ జియోకు 43 కోట్ల మంది మొబైల్ సబ్ స్రైబర్స్ ఉన్నారు. రిటైల్ అనుబంధ సంస్థకు దేశీయంగా 18,300 రిటైల్ విక్రయశాలలు ఉన్నాయి. వీటిల్లో సుమారు రూ. 2.46 లక్షల కోట్ల విక్రయాలు జరుగుతున్నాయి. డిజిటల్ మిక్స్ 17 నుంచి 18 శాతానికి పెరుగుతోంది. సమగ్ర ఆఫ్‌లైన్+ఆన్‌లైన్+ప్రైమ్ స్ట్రీమ్‌లోకి రిలయన్స్ ఎంటర్ అయితే అమెజాన్, వాల్‌మార్ట్ సంస్థలకు రిలయన్స్ గట్టి పోటీ ఇస్తుందని బెర్న్‌స్టీన్ రీసెర్చ్ నివేదిక తెలిపింది.
భారతీయ ఈ కామర్స్ విపణి 2025 నాటికి 150 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ 23 బిలియన్ డాలర్ల జీఎంవీ, అమెజాన్ 18 నుంచి 20 బిలియన్ డాలర్ల జీఎంవీతో టాప్ 2 స్థానాల్లో ప్రస్తుతం కొనసాగుతుండగా, రిలయన్స్ 5.7 బిలియన్ డాలర్ల జీఎంవీతో మూడో స్థానంలో ఉంది. ఫ్యాషన్ (అజియో), ఈ గ్రోసరీ (జియోమార్ట్) ఇందుకు సహకారం అందిస్తున్నాయి. ఈ మూడు సంస్థలు గెట్ బిగ్ , గెట్ క్లోజ్, గెట్ ఫిట్ పై మెయిన్ గా దృష్టి సారించాయి.