Shreyas Iyer: ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ కు శ్రేయస్ అయ్యర్ దూరం కానున్నాడు. ఆ్రస్టేలియా జట్టుతో ఈనెల 17న మొదలుకానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పి కారణంగా దూరమయ్యాడు.
వెన్ను గొప్పి గాయం.. (Shreyas Iyer)
ఆసీస్ తో వన్డే సిరీస్ కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆటగాడు.. వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో వెన్ను నొప్పి తిరగబెట్టడంతో ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఇక అయ్యార్ స్థానం ఖాళీ అవ్వడంతో.. మరో ఆటగాడిని త్వరలోనే ప్రకటిస్తామని సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. కాగా, ఈనెల 31న ఆరంభంకానున్న ఐపీఎల్ టోర్నీలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అయ్యర్ సారథ్యం వహించాల్సి ఉన్న విషయం తెలిసిందే. గాయం తీవ్రత కారణంగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు కూడా అయ్యర్ అందుబాటులో ఉండటం సందేహంగా మారింది.
హాట్‌కేకుల్లా టికెట్ల విక్రయం
ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డేలు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా ఈనెల 19న విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరగనున్న రెండో వన్డేకు సంబంధించిన టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. స్టేడియం సామర్థ్యం 27 వేలు కాగా.. పేటీఎం సంస్థ ఈ నెల 10, 11, 12 తేదీల్లో రూ.600 నుంచి రూ.6 వేల వరకు వివిధ విభాగాల్లో 70 శాతం టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించింది.
మిగిలిన 30 శాతం టికెట్లను స్థానిక అభిమానులను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్ స్టేడియంతో పాటు మరో రెండు సెంటర్లలో ఏసీఏ నిర్వాహక కమిటీ మంగళవారం అందుబాటులో పెట్టింది. వీటి కోసం తెల్లవారుజాము నుంచే క్రికెట్ అభిమానులు ‘క్యూ’లు కట్టారు. దీంతో టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. కాగా, సిరీస్‌లో తొలి వన్డే 17వ తేదీన ముంబైలో, మూడో వన్డే 22న చెన్నైలో జరగనుంది.