IPL 2024: ఎట్టకేలకు ఆరెంజ్ ఆర్మీ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. మూడేళ్ల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో.. హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరింది. హైదరాబాద్, గుజరాత్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దవడంతో ఇరు జట్లకూ తలో పాయింట్ వచ్చింది. 15 పాయింట్లతో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది.
2020 తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం ఇదే మొదటిసారి. గత మూడు సంవత్సరాలు ఎస్‌ఆర్‌హెచ్ పేలవ ప్రదర్శన చేసింది. 2021, 2022 సీజన్‌లలో 8వ స్థానంలో నిలిచింది. 2023 సీజన్‌లో అయితే ఏకంగా పదో స్థానంలో నిలిచి అభిమానులను నిరాశపరిచింది. ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్ కూడా నిరాశచెందింది. ఎలాగైనా పుంజుకోవాలని ప్రణాళికలు రచించింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2024 కోసం జరిగిన వేలంలో కావ్య కాసులు కుమ్మరించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆటగాళ్ల కోసం పోటీ పడింది. ప్యాట్ కమిన్స్ కోసం అయితే ఏకంగా 20 కోట్లకు పైగా ఖర్చు చేసింది.
పక్కా ప్రణాళికలతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్.. ఐపీఎల్ 2024 ఆరంభం నుంచే అదరగొట్టింది. రికార్డు స్కోర్లతో ప్రత్యర్థులను హడలెత్తించింది. చివరకు నాలుగేళ్ల తర్వాత ప్లేఆఫ్స్‌కు వచ్చింది. ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న ఆరెంజ్ ఆర్మీకి ఫైనల్ చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసేన్, నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ పరుగుల వరద పారిస్తుంటే.. భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ప్యాట్ కమిన్స్ వికెట్స్ తీసుతున్నారు. అందరూ ఈ ఫామ్ కొనసాగిస్తే.. ఈ సారి కప్పు సొంతం అవుతుందని అభిమానులు ధీమాతో ఉన్నారు.
మూడేళ్ల తరువాత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరడంపై ఆ జట్టు ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. కమ్ బ్యాక్ గట్టిగా ఇచ్చామని.. ఈ సారి టైటిల్ కూడా కొడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది కదరా ఆరెంజ్ ఆర్మీ అంటే అంటూ పోస్టులు చేస్తున్నారు.