India vs England 1st T20 matches TCA offers free metro for fans: సొంతగడ్డపై ఐదు టీ20 మ్యాచ్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. ఈ మేరకు ఇవాళ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో జట్టు బరిలో దిగుతుండగా.. అందరి కళ్లు మాత్రం టీమిండియా పేసర్ షమీపైనే ఉన్నాయి. 2023 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం గాయపడ్డాడు. తాజాగా, ఆ గాయం నుంచి కోలుకొని దాదాపు 14 నెలల తర్వాత జట్టులోకి చేరాడు. ఈ సిరీస్‌లో షమీ ఆశించిన స్థాయిలో రాణిస్తే రానున్న ఛాంపీయన్స్ ట్రోఫీలో భారత్‌కు ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారే అవకాశం ఉంది.
బలాబలాల విషయానికొస్తే.. రెండు జట్లు దాదాపు సమానంగా కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ జట్టుకు కొత్తగా మెకల్లమ్ పూర్తిస్థాయి కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. ఈ మ్యాచ్ విజయంతో సిరీస్ ప్రారంభించాలని ఇంగ్లాండ్ వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు తనదైన శైలిలో జట్టును సిద్ధం చేశాడు. ఇక, భారత్ టెస్టులకు భిన్నంగా జట్టును ఎంపిక చేసింది. టీ20 ఫార్మాట్‌లో సత్తా చాటేందుకు టీమిండియా సిద్ధమైంది. ఓపెనర్ సంజు సామ్సన్, అభిషేక్ తమ జోరు ప్రదర్శించేందుకు రెడీగా ఉన్నారు. అలాగే తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్, రింకూసింగ్ భారీ స్కోరు అందించేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఇదిలా ఉండగా, రెండో టీ20 మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా శనివారం జరగనుంది. ఇందులో భాగంగానే తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మ్యాచ్‌ను తిలకించేందుకు స్టేడియం వద్దకు వచ్చే క్రికెట్ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం కల్పిస్తున్నట్లు టీసీఏ పేర్కొంది. మ్యాచ్ టికెట్లు విక్రయించిన ప్రతి ఒక్కరూ ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు ఇప్పటికే విక్రయించినట్లు సమాచారం. కాగా, గతంలో కూడా 2023 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లకు ఉచిత మెట్రో ప్రయాణ సౌకర్యం కల్పించింది.