India Vs Bangladesh: అండర్ 10 ఆసియా కప్ విజేత భారత్ .. బంగ్లాపై గ్రాండ్ విక్టరీ

India Vs Bangladesh U19 Women’s Asia Cup Final: అండర్ 19 ఆసియా కప్‌ను భారత్ ముద్దాడింది. ఫైనల్ వరకు తగ్గేదేలే అంటూ భారత అమ్మాయిలు దూసుకొచ్చారు. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై మన అమ్మాయిలు అదరగొట్టారు. కాగా, అండర్ 19లో తొలిసారి నిర్వహించిన ఆసియా కప్‌ను భారత్ జట్టు సొంతం చేసుకుంది. మహిళల విభాగంలో టీ20 ఫార్మాట్‌లో మొదటిసారి జరిగిన టోర్నమెంట్ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 117 పరుగులు చేసింది. ఓపెనర్ కమిలిని(5)తో పాటు సానికా చల్కే(0) విఫలమవ్వగా.. మరో ఓపెనర్ త్రిష(52) పరుగులతో రాణించింది. కెప్టెన్ నికీ(12), మిథిలా(17), ఆయుషి శుక్లా(10) రన్స్‌తో పర్వాలేదనిపించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ఫర్జానా 4 వికెట్లు పడగొట్టగా.. నిషితా అక్తర్ నిషి 2, హమిబా ఒక వికెట్ తీశారు.

118 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఘోరంగా విఫలమైంది. కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో బంగ్లాపై భారత్ 41 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. బంగ్లా బ్యాటర్లలో జౌరియా ఫెర్డోస్(22), ఫమోమిదా చోయా(18) పరుగులతో రాణించగా.. ఇవా(0), సుమైయా అక్తర్ సుబోర్నా(8), కెప్టెన్ సుమైయా అక్తర్(4), సైదా అక్తర్(5), జన్నతుల(3) హబిబా(1), ఫర్జానా(5), నిషిత అక్తర్(1) విఫలమయ్యారు. భారత బౌలర్లలో ఆయుషి శుక్లా మూడు వికెట్లు పడగొట్టగా.. సిసోదియా 2, సోనమ్ యాదవ్ 2, జోషిత ఒక వికెట్ పడగొట్టారు.