Site icon Prime9

India vs Australia: బాక్సింగ్ డే టెస్ట్.. 474 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్

India vs Australia 4th Test second Day Australia all out: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ 5 టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగానే మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్ అయింది.

అంతకుముందు ఆస్ట్రేలియా 6 వికెట్లకు 311 పరుగులు చేయగా.. రెండో రోజు తొలి ఐదు ఓవర్లలో 21 పరుగులు చేసింది. అయితే సడెన్‌గా ఓ అగంతకుడు మైదానంలోకి దూసుకురావడంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. ఆ తర్వాత మళ్లీ మ్యాచ్ తిరిగి ప్రారంభం కాగా, స్టీవ్ స్మిత్ 167 బంతుల్లో సెంచరీ బాదాడు. ఆయన కెరీర్‌లో ఇది 34వ సెంచరీ కావడం విశేషం. దీంతో భారత్‌పై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా స్మిత్ రికార్డుకెక్కాడు. మొత్తం భారత్‌పై స్మిత్ 11 సెంచరీలు చేశాడు.

రెండో రోజు తొలి సెషన్‌లో భారత్‌కు వికెట్ ఎట్టకేలకు దక్కింది. పాట్ కమిన్స్(49) ఒక్క పరుగులో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన కమిన్స్.. నితీశ్ రెడ్డి సూపర్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. దీంతో ఆసీస్ 411 పరుగుల వద్ద ఏడో వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మిచెల్ స్టార్క్(15)ను జడేజా క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆసీస్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది.

అయితే భారత్ బౌలర్ల ధాటికి ఆసీస్ వరుసగా రెండో వికెట్లు కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న స్టీవ్ స్మిత్(140)ను ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో అనూహ్యంగా బౌల్డ్ అయ్యాడు. క్రీజులో పాతుకుపోయిన లైయన్(13)ను బుమ్రా ఎల్బీగా ఔట్ చేయడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. భారత్ బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా.. జడేజా 3, ఆకాశ్ దీప్ 2, సుందర్ ఒక వికెట్ తీశాడు.

Exit mobile version
Skip to toolbar