IND vs AUS 4th test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.
ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 17, శుభమన్ గిల్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రెండో రోజు అదే జోరు(IND vs AUS 4th test)
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 255/4 తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ( Australia) బ్యాటర్స్.. మొదటి రోజు జోరునే రెండో రోజు కొనసాగించారు.
ఖావాజా, గ్రీన్ ఇద్దరూ టీమిండియా బౌలర్లను ఎదుర్కొని బాగానే పరుగులు పిండుకున్నారు.
ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్న గ్రీన్.. వెటరన్ బౌలర్ అశ్విన్ కు దొరికిపోయి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 208 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.
170 బంతులు ఆడిన గ్రీన్ 18 ఫోర్లతో 114 పరుగులు చేశాడు. ఆ తర్వాత అలెక్స్ కేరీ (0), స్టార్క్ (6) వెంట వెంటనే పెవిలియన్ చేరినా.. ఖావాజా మాత్రం క్రీజులో అదే జోరు కొనసాగించాడు.
150 పరుగులు పూర్తి చేసి డబుల్ సెంచరీ వైపు వెళ్లున్నట్టు కనిపించిన ఖావాజా అక్షర్ పటేల్ బౌలింగ్ లో దొరికిపోయాడు.
422 బంతులు ఆడిన ఖావాజా 21 ఫోర్లతో 180 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
చివర్లో లియాన్ (34), టాడ్ మర్పీ (41) కాసేపు భారత బౌలర్లను ఎదురొడ్డారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్ కూడా లేదు.
టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీయగా, షమీ రెండు వికెట్లు పడగొట్టాడు.