Site icon Prime9

Dhyan Chand: హాకీ మాంత్రికుడు.. ధ్యాన్ చంద్

Hockey legend Dhyan Chand: దేశంలోని క్రీడాకారులకు, క్రీడాభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు ధ్యాన్ చంద్. భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచానికి చూపించి, మన దేశానికి ఒక విశిష్టమైన గుర్తింపు తెచ్చిన గొప్ప క్రీడాకారుడిగా ధ్యాన్‌చంద్‌ జాతి మనసులో చెరగని ముద్రవేశారు. ఆయన పేరిట కేంద్రం ఏటా ఇచ్చే ఖేల్‌రత్న అవార్డు దేశంలోని క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత గౌరవంగా భావించబడుతోంది. ధ్యాన్‌చంద్‌ 1905లో ఆగస్టు 29న నేటి ప్రయాగ్‌రాజ్‌ నగరంలో జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు.. ధ్యాన్ సింగ్. బాల్యం నుంచే హాకీ అంటే పిచ్చి. రోజూ రాత్రిపూట స్నేహితులతో కలిసి వెన్నెల వెలుగులో హకీ ఆడుతుండేవాడు. చంద్రకాంతిలో ప్రాక్టీస్ చేసేవాడు కనుక ధ్యాన్ చాంద్ అని మిత్రులు పిలవటం, క్రమంగా ఆయన పేరు ధ్యాన్ చంద్‌గా మారింది. అసాధారణమైన ప్రాక్టీస్ కారణంగా హాకీ స్టిక్‌ అతని చేతిలో మంత్రదండంగా మారిపోయింది. బంతిపై నియంత్రణ, డ్రిబ్లింగ్‌ చాతుర్యం, పాసింగ్‌లో అసాధారణ నైపుణ్యం ఆయనను హాకీ మాంత్రికుడిగా చేశాయి. ధ్యాన్‌చంద్ నాయకత్వంలో మన హాకీ జట్టు 1928 ఆమ్‌స్టర్‌డామ్, 1932 లాస్ ఏంజిలెస్, 1936 బెర్లిన్ ఒలింపిక్ గేమ్స్‌‌లో బంగారు పతకాలు సాధించింది. ఆయన బంతిని నియంత్రించే విధానం అభిమానులతో పాటు తోటి ఆటగాళ్లనూ మంత్ర ముగ్దులను చేసేది. ప్రపంచ హాకీ‌లో ‘ది విజార్డ్’గా ధ్యాన్‌చంద్ గుర్తింపు పొందాడు. ధ్యాన్ చంద్ తమ్ముడు రూప్ సింగ్ కూడా హాకీ ప్లేయర్. వీరిద్దరినీ ‘హాకీ కవలలు’ అనేవారు. 1932 సమ్మర్ ఒలింపిక్స్‌లో, ప్రత్యర్థులపై భారత్ చేసిన 35 గోల్స్‌లో వీరిద్దరూ 25 గోల్స్ చేశారు (చంద్ 12 గోల్స్ సాధించగా, సింగ్ 13 గోల్స్ చేశాడు).

1936 నాటి ఒలింపిక్స్‌తో మన జట్టు జర్మనీ టీంతో ఫైనల్ ఆడింది. అందులో ధ్యాన్‌చంద్ 9 గోల్స్ చేసి జర్మనీ టీమ్‌ను మట్టి కరిపించటం చూసి, అక్కడి గ్యాలరీలోని నాటి జర్మనీ పాలకుడు అడాల్ఫ్ హిట్లర్ షాకయ్యాడు. ‘ఆ కెప్టెన్ హాకీ స్టిక్‌లో ఏదో మాయ ఉంది. లేకపోతే.. అతను అలా ఆడలేడు’అన్నాడట. అదే రోజు రాత్రి ధ్యాన్‌చంద్‌ని పిలిపించుకొని ‘నువ్వు భారత సేనలో సుబేదార్‌గా ఉన్నావు. నువ్వు జర్మనీ తరపున ఆడితే ఎయిర్‌ఫీల్డ్ మార్షల్‌గా నియమిస్తా’ అని హిట్లర్ ఆఫర్ ఇవ్వగా, ధ్యాన్‌చంద్ దానిని సున్నితంగా తిరస్కరించారు. 1948లో తన చిట్టచివరి అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌ ఆడిన ధ్యాన్‌చంద్‌.. భారత హాకీ జట్టు కోసం 22 ఏండ్ల పాటు అలుపెరగని రీతిలో సేవలందించారు. 1930లో భారత జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో పర్యటించి 48 మ్యాచ్‌లు ఆడి 584 గోల్స్‌ చేయగా.. ఇందులో 201 గోల్స్‌ ధ్యాన్‌చంద్‌ వ్యక్తిగతంగా చేసినవే. ఓవరాల్‌గా దేశవాళీ టోర్నీల్లో కలిపి 1000కి పైగా గోల్స్ సాధించిన ధ్యాన్ చంద్ పదవీ విరమణ తరువాత రాజస్థాన్‌ లోని మౌంట్‌ అబూలో, కొన్నాళ్ల పాటు పాటియాలాలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో యువ క్రీడాకారులకు కోచ్‌గా సేవలందించారు. జీవితపు చివరి రోజులను తన సొంత ఊరైన ఉత్తర ప్రదేశ్‌ ఝాన్సీ నగరంలో గడిపారు. ప్రపంచ హాకీ చరిత్రలో తనకంటూ ఒక పేజీని సృష్టించుకున్న ధ్యాన్‌చంద్ 1979 డిసెంబర్‌ 3న.. తన 64వ ఏట అనారోగ్యంతో కన్నుమూశారు. క్రీడారంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1956లో పద్మభూషణ్‌ అవార్డునిచ్చి గౌరవించింది. ధ్యాన్‌చంద్‌ గుర్తుగా ఆయన పేరిట ఢిల్లీలో నేషనల్‌ స్టేడియాన్ని నిర్మించటంతో బాటు ఓ తపాలా బిళ్లనూ విడుదల చేశారు. క్రీడారంగంలో జీవనసాఫల్య పురస్కార గ్రహీతలకు ఇచ్చే మేజర్‌ ధ్యాన్‌చంద్‌ అవార్డును ప్రవేశ పెట్టారు.

ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌కు అత్యధిక పతకాలు అందించిన హాకీ ఒకప్పుడు వెలుగు వెలిగింది. అయితే, 1983 క్రికెట్ ప్రపంచకప్ విజయం తర్వాత హాకీ సోదిలో లేకుండా పోయింది. ఎంతలా అంటే 2008 బీజింగ్ ఒలింపిక్స్‌‌కు మన హాకీ జట్టు అర్హత కూడా సాధించలేకపోయింది. దాంతో కాసులు కురిపించే క్రికెట్‌ను కాదని ఇతర ఆటలను ప్రమోట్ చేసేందుకు స్పాన్సర్లు ముందుకు రాలేదు. అప్పటివరకు హాకీ టీమ్ స్పాన్సర్‌గా ఉన్న సహారా గ్రూపు 2018లో తప్పుకుంది. ఈ దుస్థితిని గమనించిన నాటి ఒడిశా మాజీ సీఎం నవీన్ ప‌ట్నాయ‌క్ ఈ ఆటను బతికించేందుకు ముందుకొచ్చారు. హాకీ ఆటగాడైన నవీన్.. ఒడిశా ప్రభుత్వం తరపున రూ. 100 కోట్లు కేటాయించి జట్టును స్పాన్సర్ చేశారు. అదే భారత హాకీ టీమ్ రాత‌ను మార్చింది. ఈ ఒప్పందం కారణంగా.. మన హాకీ టీమ్ టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచింది. తాజాగా పారిస్ ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటగలిగింది.

ఇక, కాస్త వర్తమానంలోకి వస్తే మన దేశం క్రికెట్ తప్ప మిగిలిన అన్ని క్రీడల్లో వెనకబడిపోయింది. దేశానికి స్వాతంత్ర్యం రావటానికి ముందే ధ్యాన్ చంద్ నాయకత్వంలోని భారత హాకీ జట్టు 3 ఒలింపిక్స్ పతకాలు సాధిస్తే ఇప్పుడు క్రీడారంగంలో భారత్ బాగా వెనకబడిపోయింది. తాజాగా 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌‌లో మొత్తం 32 క్రీడాంశాల్లో 329 పతకాలకు గానూ, 200ల దేశాలకు చెందిన 10,500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మనదేశం నుంచి 117 మంది క్రీడాకారులు 16 విభాగాల్లో పోటీ పడగా, మన దేశం 6 పతకాలకే పరిమితమైంది. ఇప్పటివరకు 25 సార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత్ సాధించిన పతకాలు కేవలం 35 మాత్రమే. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో క్రీడా రంగానికి మొత్తం రూ.3,442.32 కోట్ల నిధులు మాత్రమే కేటాయించారు. నిరుటి కంటే కేవలం రూ. 45.36 కోట్లు అదనంగా క్రీడలకు నిధులు దక్కాయి. ఇందులో గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు చేపట్టిన ‘ఖేలో ఇండియా’కు రూ.900 కోట్లు, నేషనల్ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌లకు రూ.340 కోట్లు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు రూ.822.60 కోట్ల నిధులు సమకూర్చారు. ఇవిగాక, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీకి రూ.22.30 కోట్లు, నేషనల్ డోప్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీకి రూ.22 కోట్లు విడుదలచేశారు. మొత్తం 48.2 లక్షల కోట్ల దేశ బడ్జెట్‌‌లో క్రీడారంగపు వాటాను గమనిస్తే.. మనం క్రీడలలో ఎందుకు వెనకబడి ఉన్నామో అర్థమవుతోంది.

చదువు తప్ప మరొకటి అక్కర్లేదనే ప్రస్తుతకాలపు తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి కారణంగానే దేశంలో ఎక్కువ మంది క్రీడారంగంలోకి రావటం లేదు. కానీ, క్రీడల మూలంగా ఫిట్‌నెస్‌, టైమ్ మేనేజ్‌మెంట్, డెసిషన్ మేనేజ్‌మెంట్, ఒత్తిడిని ఎదుర్కొనే శక్తి చేకూరుతుందని క్రీడా నిపుణుుల చెబుతున్నా.. దానిని పట్టించుకునే వారే లేరు. నేనొక డాక్టర్‌, ఇంజనీర్‌, సైంటిస్ట్ అని సగర్వంగా చెప్పుకుంటున్న మన సమాజంలో ‘నేనొక క్రీడాకారుడిని.. ఈ దేశంలో నాకు తగిన భవిష్యత్ ఉంటుంది’ అని ఆటగాళ్లు చెప్పుకునే పరిస్థితి లేదు. క్రీడల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన క్రీడాకారులు, తదనంతర కాలంలో తమ రంగంలో అత్యున్నత స్థాయి క్రీడాకారులను తయారుచేయలేకపోతున్నారు. మరోవైపు, పదేళ్ల వయసులోపే అంతర్జాతీయ క్రీడల్లో సత్తా చాటుతున్న అనేక మంది దేశంలో కనిపిస్తూ, ఇక్కడ ప్రతిభకు కొదవ లేదని రుజువు చేస్తూనే ఉన్నారు. కనుక ఇకనైనా ప్రభుత్వాలు క్రికెట్ వ్యామోహం నుంచి బయటపడి హాకీ, బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌, ఫుట్‌బాల్‌,అథ్లెటిక్స్‌ తదితర క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చి, తగిన వసతులు, ప్రోత్సాహం కల్పిస్తే నూతన క్రీడాభారతం ఆవిష్కృతమవుతుంది. అదే ధ్యాన్ చంద్ వర్థంతి రోజున ఆయనకు ఇవ్వగలిగిన ఘననివాళి కాగలదు.

Exit mobile version