Harmanpreet Kaur: మహిళల టీ20 ప్రపంచకప్ గెలవాలన్న భారత మహిళల జట్టు ఆశలు మరోసారి ఆవిరై పోయాయి. గురువారం రసవత్తరంగా సాగిన సెమీఫైనల్ లో 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తేలికైన పరుగు తీసే ప్రయత్నంలో హర్మన్ ప్రీత్ రనౌట్ కావడం మ్యాచ్ ను మలుపుతిప్పింది.
అనుకోకుండా దక్కిన వికెట్ తో కంగారు జట్టు విజయాన్ని చేజారకుండా ఒడిసిపట్టింది. దీంతో ఈ మెగా టోర్నీ నుంచి టీమిండియా ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది.
కీలక సమయంలో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ రనౌట్ గా నిలవడంతో ఈ మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది.
ఓ వైపు అనారోగ్యంతో బాధపడుతన్న హర్మన్ ప్రీత్ ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. అయితే రనౌట్ రూపంలో మూల్యం చెల్లించు కోవాల్సి వచ్చింది.
ఈ మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ 34 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్ తో 52 పరుగులు చేసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి పాలవ్వడంతో హర్మన్ తీవ్ర భావోద్వేగానికి లోనై అయింది. రనౌట్ అయి గ్రౌండ్ నుంచి వెళ్తూ కన్నీరు పెట్టుకుంది.
ఇక మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సమయంలో తన భావోద్వేగాన్ని కనిపించకుండా కళ్లద్దాలతో పాల్గొంది. ఈ క్రమంలో గ్లాసెస్ ఎందుకు పెట్టుకున్నారని వ్యాఖ్యాత అడగ్గా.. ‘ఖచ్చితంగా గెలుస్తామనుకున్న మ్యాచ్ ఊహించని విధంగా ఓటమి చవిచూశాం.
నేను రనౌట్ అయిన విధానం కంటే దురదృష్టం మరొకటి ఉండదేమో.. ఇక్కడ నేను ఏడుస్తుంటే నా దేశం చూడకూడదు అనుకున్నా.. అందుకే ఈ అద్దాలు పెట్టుకున్నాను. మేము ఖచ్చితంగా మెరుగుపడతాం.
ఇంకోసారి మా దేశాన్ని నిరాశ పెట్టమని మాటిస్తున్నా’ అంటూ హర్మన్ ప్రీత్ సమాధానం ఇచ్చింది. మ్యాచ్ కు ముందు తీవ్ర జ్వరంతో బాధపడుతున్న హర్మన్ .. సెమీస్ ఆడకపోవచ్చని వార్తలొచ్చాయి.