Disney+ Hotstar: క్రికెట్ అభిమానుల కోసం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ శుభవార్త చెప్పింది. త్వరలో జరగబోయే ఆసియా కప్, ఐసీసీ మెన్స్ ప్రపంచ కప్ మ్యాచ్‌లను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉచితంగా చూడొచ్చని ప్రకటించింది. అయితే, మొబైల్ లో చూసే వాళ్లకు మాత్రమే ఈ ఆఫర్ అందిస్టున్నట్టు తెలిపింది. క్రికెట్ వినోదాన్ని వీలైనంత ఎక్కువ మందికి అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తెలిపింది.
ప్రత్యేకంగా మొబైల్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్ ను తీసుకొచ్చినట్టు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తెలిపింది. దీంతో భారత్‌లో 540 మిలియన్లకు పైగా ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లకు రాబోయే ప్రతిష్ఠాత్మక క్రికెట్ టోర్నమెంట్స్ ను ఫ్రీగా చూసే అవకాశం లభిస్తుందని డిస్నీ పేర్కొంది. అలాగే టాబ్లెట్స్ లో మ్యాచ్‌లను చూసే వారికి కూడా ఈ ఆఫర్ వర్తించనుంది.
కాగా, ఆసియా కప్ 2023 ఈ సెప్టెంబరులో జరుగుతుంది. అదే విధంగా మెన్స్ ప్రపంచ కప్ అక్టోబరు 5 న మొదలై నవంబరు 19 వరకు కొనసాగనుంది. ఈ రెండు ప్రతిష్ఠాత్మక టోర్నీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసియా కప్‌లో భాగంగా మొత్తం 13 మ్యాచ్‌లు జరుగుతాయి. 10 దేశాలు తలపడనున్న వరల్డ్ కప్‌లో మొత్తం 48 మ్యాచ్‌లు ఉంటాయి. క్రికెట్‌కు విపరీతమైన క్రేజ్ ఉండే భారత్‌లో ఈ రెండు టోర్నీలకు ఓ రేంజ్లో ఆదరణ ఉంది.
మరో వైపు ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023 లో రికార్డు స్థాయిలో వ్యూయర్ షిప్ వచ్చిన విషయం తెలిసిందే. టీవీతో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ లో కూడా కోట్లాది మంది మ్యాచ్‌లను చూశారు. అయితే, ఐపీఎల్ మీడియా రైట్స్‌ను బీసీసీఐ తొలిసారి మార్పులు చేసింది. డిస్నీప్లస్ హాట్‌స్టార్ టీవీ ప్రసార హక్కులను, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో సినిమా డిజిటల్ ప్రసార హక్కులను దక్కించుకున్నాయి. కాగా, జియో సినిమా ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేసింది.