Champions Trophy 2025 India vs Pakistan on 23 February in Dubai: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. కాగా, అందరి ఆసక్తి భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌పైనే నెలకొంది. 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు ఐసీసీ వెల్లడించింది.
అయితే క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. ఈ టోర్నీ హైబ్రీడ్ మోడల్‌లో జరగనుంది. ఈ మేరకు పాకిస్తాన్‌తో పాటు దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ జట్టు ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహిస్తుండగా.. మిగిలిన జట్లు తలబడే మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో జరగనున్నాయి. ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. ఫిభ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరుగుతుండగా.. 19 రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించనుంది.
ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా ఆతిథ్య పాకిస్తాన్ జట్టు ప్రారంభం మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ జట్టు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. మొత్తంగా ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటుండగా.. ఫైనల్ మ్యాచ్‌తో కలిపి మొత్తం 15 మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఇదిలా ఉండగా, మొత్తం 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఇందులో గ్రూపు ఏలో పాకిస్తాన్, భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉండగా.. గ్రూపు బీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, అఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. ఐసీసీ మెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ 2023 పాయింట్ల పట్టికలో టాప్ 8 లో ఉన్న జట్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడేందుకు అర్హత సాధించాయి.