Ben Stokes: ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్.. ఆ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్ విధ్వంసకర ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పటి వరకు టెస్టుల్లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్ గా బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు.
మెక్ కల్లమ్ రికార్డ్ బ్రేక్.. (Ben Stokes)
ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు.. ఆ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ రికార్డ్ సృష్టించాడు. న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెక్ కల్లమ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. టెస్టు క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మెుదటి టెస్టులో ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం 109 సిక్సర్లతో.. సరికొత్త రికార్డును సృష్టించాడు. ఇప్పటి వరకు 107 సిక్సులతో మెక్ కల్లమ్ మెుదటి స్థానంలో ఉండగా.. ఆ స్థానాన్ని బెన్ స్టోక్స్ ఆక్రమించాడు. ఇక మూడో స్థానంలో ఆస్ట్రేలియా ఓపెనర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ 100 సిక్సులు కొట్టాడు.
న్యూజిలాండ్ తో జరుగుతున్న మెుదటి టెస్టు.. మూడో రోజు ఈ మైలురాయిని అధిగమించాడు. ఇంగ్లాండ్ జట్టు.. రెండో ఇన్నింగ్స్ 49వ ఓవర్‌లో స్కాట్ కుగ్గెలీజ్ ఓవర్ లో మూడో బంతిని ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్ గా మలిచి సరికొత్త రికార్డు సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో సిక్స్-హిటర్‌లో టాపర్ గా తన పేరును లిఖించుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ లో బెన్ స్టోక్స్ 33 బంతుల్లో 31 పరుగులు చేశాడు. 90వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న బెన్ స్టోక్స్ ఇప్పటి వరకు.. 12 సెంచరీలు, 28 అర్ధసెంచరీలు సాధించాడు. మెుత్తం టెస్టుల్లో 5,652 పరుగులు చేశాడు. 101 టెస్టులాడిన బ్రెండన్ మెక్ కల్లమ్ 107 సిక్సర్లు బాదాడు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. మెక్ కల్లమ్ ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు ప్రధాన కోచ్ గా ఉన్నాడు. రికార్డు బ్రేక్ చేసిన వెంటనే డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ బెన్ స్టోక్స్ సిగ్నల్ ఇచ్చాడు. అక్కడ మెకల్లమ్ చిరునవ్వులు చిందిస్తూ, చప్పట్లు కొడుతూ కనిపించాడు.
టెస్టుల్లో అత్యధిక సిక్సర్ల వీరులు వీరే..
ఇప్పటి వరకు టెస్టుల్లో అత్యధిక సిక్సులు కొట్టిన జాబితాలో బెన్ స్టోక్స్ 109 సిక్సులతో ముందున్నాడు. ఆ తర్వాతి స్థానంలో బ్రెండన్ మెకల్లమ్ 107, ఆడమ్ గిల్‌క్రిస్ట్ 100 సిక్సులు, క్రిస్ గేల్ 98, జాక్వెస్ కల్లిస్ 97, వీరేంద్ర సెహ్వాగ్ 91, బ్రియాన్ లారా 88, క్రిస్ కెయిర్న్స్ 87 వరుస స్థానాల్లో ఉన్నారు.