Agriculture News: ఉల్లి సాగు చేయాలనుకుంటున్నారా.. ఇదే మంచి సమయం!

Agriculture News: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఉల్లిపాయలు కేవలం వంట రుచి కోసమే కాదు.. కాదు.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మార్కెట్‌లో ఉల్లికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.

Agriculture News: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఉల్లిపాయలు కేవలం వంట రుచి కోసమే కాదు.. కాదు.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మార్కెట్‌లో ఉల్లికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. దీంతో రైతులు ఎక్కువగా ఉల్లి సాగుచేస్తూ.. మంచి లాభాలను ఆశిస్తారు. మరికొందరు సరైన సమయంలో కలుపు నివారణ చర్యలు సరిగా చేపట్టలేక నష్టపోతారు. అలాంటివారు.. సరైన పద్దతులు పాటిస్తే.. ఇందులో మంచి లాభాలను ఆశించవచ్చు. ఉల్లిసాగు ఎప్పుడు చేయాలి.. ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వేసవి పంటగా సాగు చేయవచ్చు (Agriculture News)

ప్రతి సీజన్ లో ఉల్లిపాయలకి మంచి గిరాకీ ఉంటుంది. ప్రస్తుతం వేసవి కాలం రాబోతున్నందున.. ఈ సమయం ఉల్లి సాగు చేసేందుకు అనువైనది. ఈ సాగులో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడి సాధించవచ్చు. ఉల్లి సాగు కాలాన్ని బట్టి పండించవచ్చు. జూన్, జూలై నుంచి అక్టోబర్ వరకు వానకాలం పంటగా సాగు చేయవచ్చు. అలాగే.. నవంబర్‌, డిసెంబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకు యాసంగి పంటగా సాగు చేయవచ్చు. ఇక ఉల్లికి మంచి దిగుబడి రావాలంటే.. జనవరి, ఫిబ్రవరి నెలల్లో నారు నాటవచ్చు. దీనినే వేసవి సాగు అంటారు. ఈ సమయంలో వాతావరణంలో పెద్దగా మార్పులు ఉండవు కాబట్టి ఈ సమయం అనుకూలమైనది. ముఖ్యంగా ఉల్లి సాగుకు నీరు నిల్వ ఉండని సారవంతమైన నేలలు మంచివి. నీరు నిల్వ ఉండే నేలలు ఈ సాగుకు పనికిరావు.

ఉల్లి రకాలు..

ఉల్లిసాగు నేలను బట్టి విత్తనాలను నాటాల్సి ఉంటుంది. ఇందులో కొన్ని ముఖ్యమైనవి.
బళ్లారి రెడ్‌.. ఈ విత్తనాల పాయలు పెద్దగా ఉంటాయి. కానీ ఇవి ఘాటు తక్కువగా ఉంటుంది. వీటిని తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో సాగు చేయవచ్చు.
రాంపూర్‌ రెడ్‌.. ఈ రకం ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి. ఈ రకం ఘాటు ఎక్కువ.. కానీ దిగుబడి తక్కువ.
నాసిక్‌ రెడ్‌.. పాయలు మధ్యస్థంగా ఉంటాయి. అలాగే ఎరుపు రంగుతో ఘాటుగా ఉంటాయి.
అగ్రిపౌండ్‌ డార్క్‌ రెడ్‌.. ఘాటుగా ఉంటాయి.. అలాగే ఈ రకాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. దిగుబడి ఎకరానికి 100 నుంచి 120 క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశం ఉంది.
అర్కనికేతన్‌.. ఎరుపు రంగుతో దాదాపు 180 గ్రాముల బరువు ఉంటాయి. నాణ్యతతో పాటు.. ఘాటు ఎక్కువ. ఎకరానికి 132 క్వింటాళ్ల వరకు సాగు చేయవచ్చు.

నారు నాటే పద్ధతి

ఈ సాగుకు ముందే నేలను.. రెండు, మూడు సార్లు దుక్కి దున్ని చదును చేయాలి. నారు నాటే ముందు ప్లూక్లోరాలిన్‌ 45% ఎకరాకు లీటర్‌ చొప్పున పిచికారీ చేసి కలియదున్నాలి. పెండిమిథాలిన్‌ 30% ఎకరాకు 1.3-1.6 లీటర్లు లేదా ఆక్సీప్లోరోపిన్‌ 23.5% 200 ఎం.ఎల్‌. చొప్పున ఏదో ఒకదానిని నాటే ముందు పిచికారీ చేయాలి. నాటిన 2, 3 రోజుల్లో తేమ ఉన్నప్పుడు ఎకరాకు ఆక్సీప్లోరోఫిన్‌ 23.5% 200 ఎం.ఎల్‌.ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నాటిన 30-45 రోజుల మధ్య మళ్లీ కలుపు తీసి మట్టిని ఎగదోయాలి. నారు నాటిన 75 రోజుల తర్వాత మాలిక్‌ హైడ్రాజైడ్‌ 0.25% (లీటర్‌ నీటికి 2.5 గ్రాములు) ద్రావణం చల్లడం వల్ల ఉల్లిగడ్డ మొలకెత్తకుండా ఉంటుంది. నారు నాటిన 100-110 రోజులకు 1 గ్రాము కార్బండిజమ్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేస్తే నిల్వలో ఉల్లిగడ్డ కుళ్లడం చాలా వరకు తగ్గుతుంది.

తెగుళ్లు.. నివారణ చర్యలు

ఉల్లిసాగు రైతులు తెగుళ్ల నివారణపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మంచి దిగుబడి రావాలంటే.. సకాలంలో మందులను పిచికారీ చేయాలి.
తామర పురుగుల నివారణకు లీటర్‌ నీటికి డై మిథోయేట్‌ లేదా పిప్రోనిల్‌ 2 మి.లీ, మాంకోజెబ్‌ 3 గ్రాముల చొప్పున కలిపి మూడు సార్లు పిచికారీ చేయాలి.
పచ్చపురుగుల నివారణకు లీటర్‌ నీటికి కార్బరిల్‌ 3 గ్రాములు లేదా ప్రొపినోఫాస్‌ 2 మి.లీ. చొప్పున పిచికారీ చేయాలి.
ఆకుమచ్చ తెగుల నివారణకు లీటర్‌ నీటితో మాంకోజెబ్‌ 3 గ్రాములు లేదా క్లోరోథలోనిల్‌ 2.5 గ్రాములు పిచికారీ చేయాల్సి ఉంటుంది.
వీటితో పాటు కుళ్లు తెగులు నివారణకు మెటలాక్సిల్‌ + మాంకోజెబ్‌ 3 గ్రాములు పిచికారీ చేయాలి.

ఎరువుల యాజమాన్యం

ఈ సాగుకు ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 60-80 కిలోల నత్రజని, 24-32 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను వేయాలి. వేరుశనగ పిండి లేదా ఆముదపు పిండి వేసి మట్టిని ఎగదోయడం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది. నత్రజనిని రెండు దఫాలుగా వేయాలి. నాటినప్పుడు, నాటిన 30 రోజుల తర్వాత వేసుకోవాలి. నత్రజనితో పాటు పొటాష్‌ రెండు దఫాలుగా వేసుకుంటే గడ్డ బాగా ఊరుతుంది. ఉల్లి నాటిన 60 రోజుల వరకు 12-15 రోజుల వ్యవధితో 4, 5 తడులు ఇవ్వాలి. గడ్డ ఊరే దశలో 6-7 రోజుల వ్యవధితో 8 తడులు ఇవ్వాలి. కోతకు 15 రోజులకు ముందు నీరు పెట్టడం ఆపివేయాలి.

సస్యరక్షణ చర్యలు

ఉల్లి సాగు చేసేటపుడు.. ఎకరాకు 80 కిలోల వేప పిండి వేయడం మంచిది. దీనివల్ల నులి పురుగులు, నేలలోని శిలీంధ్రాలు నాశనం అవుతాయి. ఎకరం పొలంలో పసుపు రంగు పూసిన డబ్బాలు రెండు చొప్పున పెట్టాలి. మరో ముఖ్యమైనది తామర పురుగుల నివారణ. దీనికి జెట్‌ నాజిల్‌ పంపుతో నీటిని చల్లాలి. అప్పుడు ఉల్లిసాగు మంచి లాభాలను ఇస్తాయి. రసం పీల్చే పురుగుల నివారణకు అల్లిక రెక్కల పురుగులను మొక్కకు రెండు చొప్పున వదలాలి. ఇలా చేస్తే.. రైతులు అధిక దిగుబడి పొందవచ్చు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/