Site icon Prime9

Mahatma Gandhi Jayanti: హే.. మహాత్మా..హే.. జాతిపిత ప్రైమ్

Hey...Mahatma...Hey..Father of the Nation

Hey...Mahatma...Hey..Father of the Nation

Gandhi Jayanthi: దేశం ఆయన వెంట నడిచింది. యావత్తు దేశం ఆయన మార్గమే దిక్కనింది. వేసిన ప్రతి అడుగు ఓ చుక్కానిలా మారింది. హింసలోనే అహింస దాగివుందని ప్రపంచానికి చాటి చెప్పేలా సాగింది ఆయన జీవిత ప్రయాణం. మరణం కాదు ముఖ్యం, శాసనం ప్రధానం అంటూ శత్రువుల గుండెల్లో శాంతి కపోతాలు ఎగరవేసిన ధైర్యశాలి ఆయన రూపం. తరతరాలకు గుర్తిండిపోయేలా ఉద్యమాలకు ఓనమాలు నేర్పిన ఆయనెవరో కాదు మనందరితో మహాత్ముడిగా, జాతిపితగా కీర్తింపబడుతున్న మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. అక్టోబర్ 2వ తేదీ ఆ మహనీయుడి జన్మదినం సందర్భంగా పూజ్య బాపూజీ పై ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక కధనం..

నేడు మనందరం హాయిగా జీవిస్తున్నామంటే, నాడు ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకొని మనకందించిన ఆ త్యాగఫలమే నేటి మన జీవిత గమనం. బ్రిటిష్ సామ్రాజ్యంలో ఇనుప సంకెళ్ల మద్య నలిగిన మన ముందు తరాల్లో ఎంతోమంది స్వాతంత్య్రం కోసం అశువులు బాసారు. ఆ మహానుభావుల్లో పూజ్య బాపూజి ఓ కీలకమైన మహోన్నతమైన ఓ వ్యక్తి. హింస కాదు అహింసతోనే దేన్నైనా సాధించవచ్చని నిరూపించిన ఆ మహనీయుడు గాంధీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. అక్టోబర్ 2, 1869న పోరుబందరులో కరంచంద్, పుత్లీభాయ్ దంపతులకు జన్మించాడు. 18 సంవత్సరాల వరకు విద్యాభ్యాసం పోరుబందర్, రాజ్ కోట్ లో సాగగా న్యాయశాస్త్రాన్ని అభ్యసించేందుకు 1888లో సంవత్సరంలో ఇంగ్లాండ్ కు వెళ్లి బారిష్టర్ పట్టా పొందాడు.

చిన్నతనం నుండే సమాజం పట్ల విపరీతమైన భావాలు ఉండడంతో దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ నిత్యం తపించేవాడు. అయితే నెమ్మది స్వభావం కల్గిన బాపూజీ తల్లి తండ్రుల మాట వింటూనే కులమతాలకు అతీతంగా అతని మాటలు సాగేవి. అంటరానితనం విడనాడాలని అందరికి పిలుపునిచ్చిన వ్యక్తి గాంధీ. వలసవాదుల వ్యతిరేకిగా ముద్రపడిన బాపూజీ దేశ స్వాంతంత్య్రం కోసం పాదయాత్రలు, నిరసన దీక్షలు, అహింసా విధానంలో ఆయన చేప్టటిన అనేక ఉద్యమాలతో యావత్తు ప్రపంచావానికి ఆయన ఓ గొప్ప మహాత్ముడిగా చిరస్మరనీయుడైనాడు.

ఆంగ్లేయుల పై తిరుగుబాటు చేసిన గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం పేరుతో ప్రజల్లో పెద్ద చైతన్యమే తీసుకొచ్చాడు. వేలాది మంది ప్రజలు ఆనాటి ఆంగ్లేయులు చరసాలలో మగ్గిన వారిలో గాంధీజీ కూడా ఉన్నారు. సత్యము, అహింసలే గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహాము అతని ఆయుధాలు, అడ్డపంచెతో, చేత కర్రబట్టి, నూలు ఒడికి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలు, కులాలూ ఒకటే అని చాటిచెప్పిన మేధావి గాంధీనీ యావత్ ప్రపంచం ఓ ధీరుడిగా గుర్తించింది.

గాంధీజీ వైవాహిక జీవితంలో కస్తూరిభాయి భార్యగా ఉన్నారు. హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దీవదాస్ గాంధీలు మహాత్ముడి సంతానం. అప్పట్లో గాంధీ తన వ్యక్తిగత పనిమీద దక్షిణాఫ్రికా వెళ్లిన సమయంలో జాతి వివక్షను కళ్లార చూసాడు. అక్కడే అలాంటి వాటిని ఎదుర్కొనేందుకు గాంధీజీలో బీజం పడింది. 1894లో భారతీయుల ఓటు హక్కులను కాలరాసే ఒక బిల్లును అతను తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో ప్రజల్లో బాగా జనాధరణ సంపాదించాడు. భారతీయ కార్మికులకు నాడు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి అతను మొదలుపెట్టిన సత్యాగ్రహం దాదాపుగా 7 సంవత్సరాలు సాగింది. ఎంతోమంది జైలుపాలయ్యారు. అయినా చివరకు గాంధీ సిద్ధాంతమే గెలిచింది.

స్వాతంత్య్రం కోసం చమటోడ్చిన బాపూజీ ఏనాడు, రాజకీయ కుర్చీపై ఆసక్తి కనపరచలేదు. కేవలం మన ప్రజలు, మన ప్రాంతం, మన హక్కు, మన జీవన విధానం అనేందులోనే చూపించిన ఆసక్తి, బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించే స్థాయికి చేర్చింది. ఆయనకు ఏనాడు ఆంగ్లేయుల పై ధ్వేషం లేదు. సంస్కరణల పైనే అతని ఆసక్తి అంతా. అది కూడా పేదవాడు, కార్మికుడి నోరు కొట్టేందుకు ఎవరూ ప్రయత్నించకూడదు అనేది గాంధీజీ సిద్ధాంతం.

స్వదేశీ వస్తువులను వినియోగించడం, నూలు వడకడం, ఖద్దరు ధరించడం, విదేశీ విద్యను, బ్రిటిష్ సత్కారాలను తిరస్కరించడం వంటి విధానాలతో మహిళా చైతన్యాన్ని కూడా దేశంలో గాంధీజీ తీసుకొచ్చాడు. ప్రతివక్కరిలో ఆత్మాభిమానము, ఆత్మ విశ్వాసము, శ్రమకు తగ్గ గౌరవాన్ని ఆయన దగ్గరకు చేసారు.

అన్యాయం జరిగితే వారికి ఏ మాత్రమూ సహకరించకపోవడం, పాలించే హక్కు  లేనందున పన్నులు కట్టకుండా ఉండడం వంటి సహాయ నిరాకరణ గాంధీజీ ఉద్యమానికి పెద్ద స్పందనే వచ్చింది. సమాజ దురాచార నిర్మూలన, పరిపూర్ణమైన వ్యక్తి వికాసమే నిజమైన స్వాతంత్య్రంగా భావించేవాడు. అంటరానితనం, మత విద్వేషాలు మద్య స్వాతంత్య్రం రాదని నమ్మిన వ్యక్తి గాంధీజీ. నాటి ఆయన ఆలోచనలే నేటి మనందరి జీవన విధానానికి ఓ పూలబాటగా గుర్తించాలి. ఆంగ్లేయుల నుండి స్వాతంత్య్రం సాధించిన తర్వాత తన 78వ ఏట గాంధీజి దుర్మరణం పాలైనారు. జనవరి 30, 1948న ఢిల్లీలోని ఓ ప్రార్ధన సమావేశానికి వెళ్లి వస్తుండగా నాధూరాం గాడ్సే అనే వ్యక్తి గాంధీజీ పై తుపాకీ గురిపెట్టి కాల్చాడు. ఘటనా సమయంలో నేలకొరిగిన ఆ మహాత్ముడు చివరగా హేరాం అంటూ చనిపోయిన్నట్లు కధనంతో తెలుస్తుంది.

మనిషి ధనం ఎంత సంపాదించాడు అనేది ముఖ్యం కాదు. ఎంతటి ప్రేమ, అనురాగాలు, బాధ్యతలు, భాందవ్యాలు, సంస్కారం మాటున సాగే జీవన విధానమే మన పూజ్య బాపూజీకి మనమిచ్చే నిలువెత్తు నివాళి. జాతిపితకు జైహింద్..

Exit mobile version