Karnataka Cricket Association approaches High Court : ఆర్సీబీ జట్టు విజయోత్సవం సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి మైదానం వద్ద తొక్కిసలాట ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమపై దాఖలైన కేసును సవాల్ చేస్తూ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది.
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) అధ్యక్షుడు రఘురామ్ భట్, కార్యదర్శి ఎ.శంకర్, కోశాధికారి ఈఎస్ జయరాం సంయుక్తంగా కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తమపై నమోదైన కేసును కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. కేసుపై అత్యవసర విచారణ జరపాలని కోర్టును అభ్యర్థించారు. మధ్యాహ్నం విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి ఆర్సీబీ జట్టు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేనుతోపాటు విజయోత్సవ ఈవెంట్ నిర్వాహక సంస్థ డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ముగ్గురు సిబ్బందిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.
బుధవారం సాయంత్రం చిన్నస్వామి మైదానం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. 50 మందికి పైగా గాయపడ్డారు. కర్ణాటక హైకోర్టు ఘటనను సుమోటోగా పరిగణించి విచారణ జరిపింది. ఈవెంట్‌ను నిర్వహించటంలో వైఫల్యం ఎవరిదో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే కోర్టు సూచనతో తొక్కిసలాట ఘటన దర్యాప్తునకు సీఐడీ పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ప్రభుత్వం ఏర్పాటుచేసింది.