Karnataka High Court : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు విచారణ జరిపింది. ప్రమాదం జరిగిన తీరును ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి వివరించింది. ఘటన సమయంలో చిన్నస్వామి మైదానం పరిసర ప్రాంతాల్లో వెయ్యి మందికి పైగా పోలీసులు విధుల్లో ఉన్నట్లు తెలిపింది. అంతకుముందు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడారు. ఆర్సీబీ కార్యక్రమానికి 5వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పడం గమనార్హం.
తొక్కిసలాట ఘటనపై విమర్శలు వచ్చాయి. వ్యవహారాన్ని హైకోర్టు సుమోటోగా పరిగణించింది. వేడుక కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం విషాదంగా మారిందని కోర్టు పేర్కొంది. ఈ ఘటన వెనుక కారణాలను తేల్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడింది. ఇలాంటి ఘటనలను మనం నివారించగలమా? భవిష్యత్‌లో జరగకుండా ఉండాలంటే ఏం చేయగలం? అన్నవి ఆలోచించాలని కోర్టు అభిప్రాయపడింది.
అనంతరం ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. వాటర్ ట్యాంకర్లు, అంబులెన్స్‌లు, కమాండ్ అండ్ కంట్రోల్ వాహనాలను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. మైదానం సామర్థ్యం 35వేలు మాత్రమే అన్నారు. సాధారణ సమయాల్లో 30వేల టికెట్లు మాత్రమే ఇస్తారని, కానీ, బుధవారం జరిగిన కార్యక్రమానికి 2.5లక్షల మందికి పైగా అభిమానులు వచ్చారని తెలిపారు. అందరినీ లోపలికి పంపిస్తారని వారు భావించారని, మధ్యాహ్నం నుంచి రద్దీ మొదలైందని తెలిపారు. సాయంత్రానికి కిక్కిరిసిపోయి పరిస్థితి చేయిదాటిపోయిందని వివరించారు.
తాము నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించలేదని ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంలో న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా పాటించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొంది. వాదనలు విన్న కోర్టు దీనిపై తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.