Site icon Prime9

ISRO : అస్సాంకు సొంత శాటిలైట్‌.. ఇస్రోతో సర్కారు చర్చలు

ISRO

ISRO : అస్సాం సర్కారు రాష్ట్ర అవసరాల కోసం సొంతంగా ఉపగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటోంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇస్రోతో చర్చలు మొదలు పెట్టినట్లు తెలిపింది. రాష్ట్ర సరిహద్దులపై నిఘా ఏర్పాటు కోసం దోహదం చేస్తుందని తెలిపింది. సామాజిక ఆర్థిక ప్రాజెక్టుల అమలుకు అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు కూడా ఉపయోగపడుతుందని వెల్లడించింది. దేశంలోనే సొంత ఉపగ్రహం కలిగిన తొలి రాష్ట్రంగా అస్సాం నిలువనుంది.

రాష్ట్రం కోసం..
ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ అథరైజేషన్‌ సెంటర్‌ సహకారంతో రాష్ట్రం అవసరాల కోసం ఉపగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నామని తెలిపింది. కీలకమైన ప్రాజెక్టుల అమలుకు అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఎంతగానో దోహదం చేస్తుందని ఆర్థిక మంత్రి అజంతా నియాగ్‌ వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెట్టింది. వ్యవసాయం, విపత్తు నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సరిహద్దు నిర్వహణ, పోలీస్‌ ఆపరేషన్లలో కీలక సేవలు అందిస్తుందని చెప్పారు.

సొంతంగా ఉపగ్రహం ఉంటే..
ఇదే అంశంపై సీఎం హిమంత బిశ్వశర్మ మాట్లాడారు. అస్సాంకు సొంతంగా ఉపగ్రహం ఉంటే విదేశీయుల అక్రమ చొరబాట్లను అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. వాతావరణ నివేదిక ద్వారా రాబోయే వరదల గురించి ముందుగానే తెలుసుకోవచ్చని తెలిపారు. ఇటీవల ఉమ్రాంగ్సోలో చోటుచేసుకున్న బొగ్గు గని ప్రమాదాన్ని సీఎం ప్రస్తావించారు. ఉపగ్రహ సమాచారాన్ని పొందేందుకు నెలన్నర సమయం పట్టిందన్నారు. సొంతగా ఉపగ్రహం ఉండటం వల్ల మన ప్రాంతంపై పూర్తి నిఘా ఉంచుతుందన్నారు. దీని ఏర్పాటు కోసం ఇస్రోతో చర్చలు మొదలుపెట్టామని సీఎం హిమంత వెల్లడించారు.

Exit mobile version
Skip to toolbar