Site icon Prime9

MK Stalin: హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం.. ‘ఎన్‌ఈపీ’ అమలు ప్రసక్తే లేదు

Tamil Nadu CM Stalin says he won’t sign NEP even if Centre offers Rs 10,000 crore: జాతీయ విద్యావిధానాన్ని (ఎన్‌ఈపీ) తమిళనాడులో అమలు చేసే ప్రసక్తే లేదని సీఎం ఎంకే స్టాలిన్‌ మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్రం రూ.10 వేల కోట్లు మంజూరు చేసినా అంగీకరించేది లేదన్నారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నమే కాకుండా.. విద్యార్థుల భవిష్యత్, సామాజిక న్యాయవ్యవస్థపై ప్రభావం చూపే అనేక అంశాలు ఉండటం వల్లే ‘ఎన్‌ఈపీ’ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. భారతీయ భాషల మధ్య మంటలు పెట్టొద్దంటూ ప్రధాని మోదీ హితబోధ చేసిన వేళ.. కడలూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో స్టాలిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏ భాషనూ వ్యతిరేకం కాదు..
తాము ఏ భాషనూ వ్యతిరేకించడం లేదని స్పష్టంచేశారు. కేవలం హిందీ కోణంలోనే కాకుండా.. ఎన్‌ఈపీపై వ్యతిరేకతకు ఇతరత్రా అనేక కారణాలూ ఉన్నాయని, నీట్‌ మాదిరిగానే ఆర్ట్స్, సైన్స్ కళాశాలల్లో ప్రవేశాలకూ పరీక్షలు రాయాల్సి వస్తుందన్నారు. విద్యార్థులను చదువుల నుంచి దూరం చేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఇప్పుడు అందుతున్న ఆర్థిక సాయాన్ని అడ్డుకుంటుందన్నారు. ‘ఎన్‌ఈపీ’ని అమలు చేస్తే రాష్ట్రానికి రూ.2 వేల కోట్లు వస్తాయని కేంద్రం చెబుతోందని, రూ.10 వేల కోట్లు ఇచ్చినా అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తమిళనాడును రెండు వేల ఏళ్లు వెనక్కి నెట్టే పనిని చేయనని సీఎం వ్యాఖ్యానించారు.

తమిళనాడు, కేంద్రం మధ్య వివాదం
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చుతోంది. ఎన్‌ఈపీ పేరుతో హిందీని తమపై బలవంతంగా రుద్దేందుకు యత్నిస్తున్నారని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేశారని తమిళనాడు సీఎం ఆరోపిస్తుండగా, రాజకీయ కోణంలో చూడవద్దంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి కోరారు. తేనెతుట్టెపై రాళ్లు వేయవద్దంటూ స్టాలిన్‌ ఘాటుగా ప్రతిస్పందించిన నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

భాషల మధ్య మంటలు..
భారతీయ భాషల మధ్య మంటలు పెట్టొద్దంటూ ప్రధాని హితబోధ చేశారు. దేశ భాషల మధ్య ఎన్నడూ వైరం లేదని, అవన్నీ పరస్పరం చేయూతనందించుకుంటూ సుపంపన్నమయ్యాయని తెలిపారు. భాషల ప్రాతిపదికన విభేదాలు సృష్టించే యత్నాలు జరిగినప్పుడు భారతీయ భాషా వారసత్వం దీటుగా వాటికి సమాధానమిచ్చిందని పేర్కొన్నారు. భాషాపరమైన దురభిమానాలకు దూరంగా ఉండటం మనందరి సామాజిక బాధ్యత అని గుర్తుచేశారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనం కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version
Skip to toolbar