Site icon Prime9

New electricity charges: పగటిపూట 20 శాతం తగ్గి.. రాత్రి పూట 20 శాతం మేర పెరిగి.. త్వరలో కొత్త విద్యుత్‌ చార్జీలు అమలు

new electricity charges

new electricity charges

New electricity charges: త్వరలో కొత్త విద్యుత్‌ ఛార్జీలు అమలులోకి రానున్నాయి. దీని ప్రకారం పగటిపూట విద్యుత్‌ ఛార్జీలు 20 శాతం వరకు తగ్గనున్నాయి. అయితే రాత్రిపూట పీక్‌ వేళల్లో విద్యుత్‌ ఛార్జీలను 20 శాతం మేర పెంచనున్నారు. దీనికి సంబంధించిన కొత్త విద్యుత్ నియమాలను కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది.

పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచాలని..(New electricity charges)

పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ కొత్త వ్యవస్థను అమలు చేయడం వల్ల పీక్‌ సమయాల్లో గ్రిడ్‌పై భారంతోపాటు విద్యుత్‌ డిమాండ్‌ తగ్గుతుందని పేర్కొంది. 2024 ఏప్రిల్ నుంచి తొలుత వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఈ విధానం అమలులోకి వస్తుందని తెలిపింది. ఏడాది తర్వాత వ్యవసాయ రంగం మినహా, మిగతా అన్ని రంగాల విద్యుత్‌ వినియోగదారులకు ఈ రూల్‌ను వర్తింపజేయనున్నట్లు వెల్లడించింది.

కాగా, సౌర విద్యుత్తు చౌకని, సోలార్ విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే పగటి సమయాల్లో విద్యుత్‌ ఛార్జీలు తక్కువగా ఉంటాయని, తద్వారా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. సౌర శక్తి అందుబాటులో లేని రాత్రి సమయాల్లో థర్మల్, హైడ్రో, గ్యాస్ ఆధారిత ప్లాంట్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందన్నారు. సౌర విద్యుత్‌ ఉత్పత్తి కంటే వాటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రాత్రి వేళ విద్యుత్‌ ఛార్జీలను ఇది ప్రతిబింబిస్తుందని అన్నారు. 2030 నాటికి శిలజాయేతర ఇంధనాల శక్తి సామర్థ్యాన్ని 65 శాతం చేరేందుకు ఈ విధానం సహాయ పడుతుందని కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. అలాగే 2070 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా లక్ష్యానికి అనుగుణంగా ఈ దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు.

కాగా, కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఈ విధానం వల్ల సోలర్‌ విద్యుత్‌ వ్యవస్థ ఉన్న వినియోగదారులకు మేలు జరుగనున్నది. అలాగే పగటి పూట వినియోగించే విద్యుత్‌కు తక్కువ ఛార్జీలు, రాత్రి వేళ వినియోగించే లైట్లు, ఫ్యానులు, ఏసీలు వంటి వాటికి ఎక్కువ విద్యుత్‌ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.

Exit mobile version