Site icon Prime9

Elon Musk : కేంద్ర ప్రభుత్వంపై మస్క్ ఎక్స్ సంస్థ దావా

Elon Musk

Elon Musk

Elon Musk : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ నేతృత్వంలోని సోషల్ మీడియా ‘ఎక్స్‌’ కేంద్ర ప్రభుత్వంపై దావా వేసింది. ఈ సందర్భంగా కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చట్టవిరుద్ధంగా కంటెంట్‌ను నియంత్రిస్తోందని, ఏకపక్షంగా సెన్సార్‌షిప్‌నకు పాల్పడుతోందని కేంద్రంపై ఆరోపణలు చేసింది.

 

 

ఐటీ చట్టం, సహ్యోగ్ పోర్టల్ నిబంధనలు తమకు ఉన్న చట్టబద్ధమైన రక్షణలను ఉల్లంఘించేలా ఉన్నాయని, ఇది తమపై అనధికారికంగా సెన్సార్ చేయడం కిందికి వస్తుందని ఎక్స్ సంస్థ తన పిటిషన్‌లో పేర్కొంది. ప్రభుత్వం ఐటీ చట్టంలోని సెక్షన్‌ 79(3) (బీ)ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది. ఐటీ చట్టం ప్రకారం బ్లాక్‌ చేసిన కంటెంట్‌ను తొలగించకపోతే, ఎక్స్‌ తన చట్టబద్ధమైన రక్షణ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ సెక్షన్‌ కింద కంటెంట్ బ్లాక్ చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇవ్వలేదని ఎక్స్ సంస్థ వాదిస్తోంది. సెక్షన్ 69ఏని పక్కదారి పట్టించడానికి అధికారులు నిబంధనను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంది.

 

 

దేశంలో అల్లర్లు, గొడవలకు కారణం అయ్యే పోస్టులు, పూర్తి వివరాలు లేకుండా సృష్టించిన ఖాతాలపై నియంత్రణ విధించేందుకు సెక్షన్‌ 69-ఎ ప్రకారం కేంద్రానికి అధికారం ఉంటుంది. అదే సమయంలో సెక్షన్‌ 79(3)(బీ) స్పష్టమైన నియమాలు, తనిఖీలు లేకుండా అధికారులు సమాచారాన్ని బ్లాక్ చేయడానికి అధికారులు అనుమతి ఇస్తున్నారని తన పిటిషన్‌లో ప్రస్తావించిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇది విస్తృతమైన సెన్సార్‌షిప్‌నకు దారితీస్తోందని విమర్శలు చేసింది. దావాపై కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి స్పందన వచ్చింది. ప్రభుత్వం చట్టాన్ని అనుసరించి ముందుకెళ్తుందని, సోషల్ మీడియా సంస్థలు నిబంధనలు పాటించాలని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Exit mobile version
Skip to toolbar