Smoking In Flight: ఓ ప్రయాణికుడు విమానంలో బీడీ కాల్చడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. రాజస్థాన్ లోని మార్వాడ్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వృద్ధుడు అహ్మదాబాద్ నుంచి బెంగళూరు కు విమానంలో ప్రయాణం చేశాడు. విమానంలో ప్రయాణిస్తున్న టైమ్ లో బాత్రూం వెళ్లిన ఆయన బీడీ కాల్చడం మొదలు పెట్టాడు. అయితే పొగలు రావడంతో విమానంలోని ఫైర్ అలారం మోగింది. దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది తనిఖీలు చేపట్టారు.
రూల్స్ తెలియకపోవడంతో..(Smoking In Flight)
బాత్రూం నుంచి పొగ రావడాన్ని గమనించిన సిబ్బంది బెంగళూరు ఎయిర్ పోర్టు సిబ్బందికి సమాచారం అందించారు. బాత్రూం నుంచి బయటకు వచ్చిన వృద్ధుడిని సిబ్బంది ప్రశ్నించారు. అయితే తాను మొదటిసారి విమాన ప్రయాణం చేశానని.. ఇక్కడ రూల్స్ గురించి తెలియదని సమాధానమిచ్చాడు. రైలు, బస్సు ప్రయాణాల్లో ఎన్నో సార్లు టాయిలెట్లలో స్మోకింగ్ చేశానని.. ఆ విధంగానే విమానంలో కూడా బీడీ కాల్చినట్టు చెప్పడంతో సిబ్బంది అవాక్కైయ్యారు.
బెంగళూరు విమనాశ్రయంలో విమానం ల్యాండ్ కాగానే అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు అయన్ను అరెస్టు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా విమానంలో బీడీ కాల్చి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యవహరించినందుకు ఆయనపౌ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అతనికి కనీసం వారం రోజులు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయన్నారు. విమానంలో రూల్స్ తెలియక బీడీ తాగానని.. తన తప్పును మన్నించి విడుదల చేయాలని వృద్ధుడు పోలీసులను కోరాడు.