Tamil Nadu Minister : తమిళనాడు అటవీశాఖ మంత్రి కె.పొన్ముడి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అవమానకరరీతిలో వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గాయని చిన్మయి, నటి ఖుష్బూతోపాటు పలువురు ప్రముఖులు మంత్రి తీరును ఖండించారు. సొంత పార్టీ నుంచి విమర్శలు రావడంతో డీఎంకే పార్టీ చర్యలు చేపట్టింది.
వీడియో నెట్టింటా వైరల్..
ఓ కార్యక్రమంలో పొన్ముడి మాట్లాడిన వీడియో నెట్టింటా వైరల్‌గా మారింది. అందులో ఆయన సెక్స్ వర్కర్లు, కస్టమర్ల మధ్య సంభాషణ ఇలా ఉంటుందంటూ అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించారు. ఇదంతా జోక్ అంటూ మంత్రి మాట్లాడిన తీరు మహిళలను కించపర్చేలా ఉంది. దీంతో మంత్రి పొన్ముడిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలువురు ప్రముఖులు కూడా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
బీజేపీ నాయకురాలు, నటి ఖుష్బూ సుందర్ స్పందించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘మీ మంత్రి చేసిన వ్యాఖ్యలకు అర్థమేంటో నాకంటే బాగా మీకే తెలుసన్నారు. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలను మీ ఇంట్లోని మహిళలు అంగీకరిస్తారా?’ అని ఆమె ఆగ్రహించారు. ఆయన్ను వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి మంత్రిని ఆ దేవుడే శిక్షిస్తాడని గాయని చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖండించిన డీఎంకే ఎంపీ కనిమొళి..
డీఎంకే ఎంపీ కనిమొళి మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. ‘మంత్రి పొన్ముడి వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. కారణం ఏదైనా సరే.. మహిళలపై అతడు చేసిన అవమానకర వ్యాఖ్యలను ఖండించాల్సిందేనని ఆమె ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఇది కాస్తా వివాదాస్పదమవడంతో మంత్రి పొన్ముడిని డీఎంకే పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తప్పించింది.
ఇదేమీ తొలిసారి కాదు..
మంత్రి పొన్ముడి వివాదాల్లో చిక్కుకోవడం ఇది తొలిసారి కాదు. గతంలో ఉచిత బస్సు సౌకర్యం గురించి మాట్లాడారు. మహిళలను వలసదారులతో పోల్చారు. దీంతో విమర్శలకు దారితీసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలపై ఆయనకు మద్రాసు హైకోర్టు జైలు శిక్ష కూడా విధించింది. దీంతో ఆయన శాసన సభ్యత్వంపై అనర్హత వేడు పడింది. అనంతరం శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వటంతో తిరిగి మంత్రి మండిలో చోటు దక్కించుకున్నారు.