Siddaramaiah: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరు ఖరారైంది. ఆయన రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధరామయ్య సీనియారిటీ, క్లీన్ ఇమేజ్, ఓబిసి నేత, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పని చేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకునే అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చిందని చెబుతున్నారు. 20 నిమిషాలపాటు సోనియా, రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య భేటీ అయ్యారు. అయితే రెండేళ్లపాటు సిద్ధ రామయ్య, ఆ తరువాత మూడేళ్ళపాటు డికె శివకుమార్ ముఖ్యమంత్రిగా సేవలందించనున్నారని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి.
సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి విపక్ష నేతలని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. ఇక సిఎం పదవికోసం పోటీ పడిన పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్‌కి డిప్యూటీ సిఎం పదవి కట్టబెట్టాలని ఏఐసిసి నిర్ణయించింది. డీకే శివకుమార్ కు విద్యుత్ , నీటిపారుదల శాఖలు కేటాయించనున్నారు. సిద్ధరామయ్య, డికెతోపాటుగా మరో 10మంద క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పిసిసి అధ్యక్షుడిగా కూడా డికె శివకుమార్‌ని కొనసాగించనున్నారు.
సిద్ధ రామయ్య రాజకీయంగా బాగా సీనియర్. 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 75 సంవత్సరాల సిద్దరామయ్య కురబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గతంలో ప్రతిపక్ష నేతగా, సిఎంగా పని చేశారు. అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు. క్లీన్ ఇమేజ్‌తో పరిపాలనా అనుభవం ఉన్న సిద్దరామయ్య ఆ పదవికి సరైన వ్యక్తన్న అభిప్రాయానికి హైకమాండ్ వచ్చింది. ఇవే నా చివరి ఎన్నికలు. దీని తరువాత ఎన్నికల రాజకీయాల నుండి తప్పుకుంటానని సిద్ద రామయ్య ప్రచారంలో పదే పదే చెప్పారు. సిద్దరామయ్య 2013 నుంచి 2018 వరకు కర్నాటక సిఎంగా పని చేశారు. ఇంతకుముందు అయిదేండ్ల పాటు సిఎం పదవిలో కొనసాగిన నేతగా గుర్తింపు ఉంది.