Site icon Prime9

Union Minister Rekha Khadse : కేంద్ర మంత్రి కుమార్తెకు పోకిరీల వేధింపులు

Union minister Raksha Khadse

Union minister Raksha Khadse

Union Minister Rekha Khadse : మహారాష్ట్రలో శాంతిభద్రతలపై కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే ఆందోళన వ్యక్తం చేశారు. జల్‌గావ్ జిల్లా ముక్తాయ్‌నగర్‌లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తన కుమార్తె పాల్గొన్నదని, కొందరు యువకులు వేధించారని ఆమె పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

సంత్ ముక్తాయ్ యాత్రలో..
మహాశివరాత్రి సందర్భంగా తమ ప్రాంతంలో ప్రతి సంవత్సరం సంత్ ముక్తాయ్ యాత్ర నిర్వహిస్తారని, ఇటీవల కార్యక్రమాన్ని నిర్వహించారని, ఈ కార్యక్రమానికి స్నేహితులతో కలిసి యాత్రకు వెళ్తానని తన కూతురు కోరడంతో సెక్యూరిటీ సాయంతో పంపించినట్లు తెలిపారు. అదే సమయంలో కొందరు యువకులు వారిని వెంబడించి వేధించారని, అడ్డుకున్న భద్రతా సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. గుజరాత్ పర్యటన నుంచి తాను ఇంటికి రాగానే తమ కూతురు విషయం చెప్పిందన్నారు. ఎంపీ, కేంద్రమంత్రి కుమార్తెకు ఇలాంటి దుస్థితి ఎదురైతే.. సాధారణ మహిళల పరిస్థితి ఏ విధంగా ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు కేంద్రమంత్రి మీడియాకు వెల్లడించారు.

మహారాష్ట్రలో మహిళలపై పెరుగుతున్న నేరాలు..
ఇదే అంశంపై రక్షా ఖడ్సే మామ, మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే మాట్లాడారు. యువకులపై గతంలోనూ పోలీసులకు ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వీరు కరుడుగట్టిన నేరస్తులు అని పేర్కొన్నారు. మహారాష్ట్రలో రోజురోజుకూ మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని, నేరస్తులు పోలీసులకు భయపడడం లేదని చెప్పారు. బాధిత అమ్మాయిలు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెల పేర్లు బయటకు రావొద్దని భావిస్తున్నారని, తమకు ప్రత్యామ్నాయం లేకనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

యువకులు పోలీసులపై దాడి..
పోలీస్ స్టేషన్‌కు వెళ్తే పోలీసులు తమను రెండుగంటలపాటు కూర్చోబెట్టారని తెలిపారు. అమ్మాయిల విషయం కావడంతో ఆలోచించుకోవాలని సూచించినట్లు చెప్పారు. యువకులు పోలీసులపై దాడి చేసి సందర్భాలు అనేకం ఉన్నాయని తెలిపారు. యువకులకు రాజకీయ నాయకుల అండ ఉందని స్పష్టం చేశారు. ఇదే విషయంలో డీఎస్పీ, ఐజీతోనూ మాట్లాడినట్లు ఖడ్సే చెప్పారు.

స్పందించిన సీఎం ఫడ్నవీస్..
ఘటనపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. నిందితులు ఓ రాజకీయ పార్టీకి చెందినవాళ్లని, కొందరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారని చెప్పారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తాజా పరిణామంపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ మాట్లాడారు. మహాయుతి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు.

Exit mobile version
Skip to toolbar