Prime9

Sharad Pawar : ఎన్సీపీ ముక్కలవుతుందని ఊహించలేదు : శరద్‌ పవార్‌

NCP (SP) President Sharad Pawar : నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ ముక్కలవుతుందని కలలోనైనా ఊహించలేదని ప్రస్తుత ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అన్నారు. పార్టీ చీలిపోయినా సవాళ్లను ఎదుర్కొని కార్యకలాపాలను ముందుకెళ్లిన నాయకులు, కార్యకర్తలను అభినందించారు. ఎన్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రారంభం నుంచి పార్టీ ఎన్నో సవాళ్లు, ఒడిదొడుకులను ఎదుర్కొందని చెప్పారు. అయినా నిరుత్సాహపడకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లినట్లు తెలిపారు.

 

పార్టీ ముక్కలవుతుందని అసలు ఊహించలేదన్నారు. కొద్దిమంది వ్యక్తుల భావజాలాలు పార్టీని విడగొట్టాయని ఆవేదన వ్యక్తంచేశారు. దాని గురించి మాట్లాడదలచుకోలేదన్నారు. పార్టీ సిద్ధాంతాలను నమ్మినవారే అందులో కొనసాగుతారన్నారు. రానున్న ఎన్నికల్లో మీరే సరికొత్త ములుపులు చూస్తారని తెలిపారు. పార్టీలో ఎవరు చేరుతున్నారు? ఎవరు వెళ్లిపోతున్నారు? తదితర విషయాలు ఎవరూ పట్టించుకోవద్దని కోరారు. కలిసికట్టుగా ప్రజలను ఏకం చేయగలిగితే ఎలాంటి సమస్యలు దరిచేరవన్నారు. ప్రజలకు సేవ చేయాలని చాలామంది నాయకులు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. వాళ్లే పార్టీకి బలం, బలగం అన్నారు. అధికారం గురించి ఆలోచించొద్దని సూచించారు. మనమంతా కలిసి ఉంటే, అది మనల్ని ఫాలో అవుతుందని పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు.

 

మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు..
మరో రెండు మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని తెలిపారు. ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్సీపీ (ఎస్పీ) కొత్త తరం నాయకులను తయారు చేసేందుకు కృషిచేస్తోందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, ఏయే చోట్ల వారిని పోటీకి నిలిపితే ప్రయోజనాలు ఉంటాయో ప్రణాళికలు రచించాలని కోరారు. 2023 జులైలో ఎన్సీపీ రెండుగా చీలిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్‌ పవార్‌కు పార్టీ పేరు, గుర్తులను ఎన్నికల సంఘం.. శరద్‌ పవార్‌ వర్గానికి ఎన్సీపీ (ఎస్పీ) పేరును ఖరారు చేసింది.

Exit mobile version
Skip to toolbar