Sambhal Shahi Jama Masjid Survey: ఉత్తరప్రదేశ్‌లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సంభాల్‌లోని షాహీ జామా మసీదును హరిహర్ ఆలయంగా పేర్కొనగా.. కోర్టు సర్వే కోసం ఆదేశాలు జారీ చేసింది. అయితే మొఘల్ చక్రవర్తి బాబర్.. 1529లో ఈ ఆలయాన్ని పాక్షికంగా కూల్చివేశారని న్యాయవాది విష్ణు శంకర్ జైన్ పేర్కొన్నారు. అనంతరం మసీదు సర్వే కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఓ ప్రత్యేక బృందం షాహీ జామా మసీదు సర్వే కోసం వెళ్లింది. అయితే సర్వే చేసేందుకు అధికారులు వెళ్లగా.. స్థానికులు వారిపై ఎదురుదాడికి దిగారు. కొంతమంది ఏకంగా రాళ్లు రువ్వారు. అలాగే పలు వాహనాలకు నిప్పు పెట్టారు.
మసీదు రీ సర్వే చేసేందుకు ఏఎస్ఐ బృందం ఆదివారం తెల్లవారుజామున జామా మసీదు వద్దకు చేరుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న కొంతమంది ముస్లిం వర్గాలు అక్కడికి చేరుకొని మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా గందరగోళం నెలకొంది. అల్లర్లకు పాల్పడిన అల్లరి మూకలపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. వారికి చెదగొట్టేందుకు పోలీసులు పెద్దఎత్తున రంగంలో దిగారు. కొంతమంది అల్లరి మూకలు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎస్పీ పీఆర్ఓ గాయపడ్డారు. అయితే మసీదు స్థలంలోనే హరిహర ఆలయం ఉందంటూ దాఖలైన పిటిషన్లపై కోర్టు ఆదేశానుసారం ఇటీవల సర్వే నిర్వహించారు. అడ్వకేట్ కమిషనర్ ఆధ్వర్యంలో రెండో సర్వే సందర్భంగా ఆదివారం హింసకు దారితీసింది.
సర్వే చేసేందుకు అధికారులు మసీదు వద్దకు వెళ్లగా.. ఓ వర్గం అడ్డుకుంది. కాసేపటికే అధికారులపై రాళ్లు, చెప్పులు విసరడంతో పాటు దాడికి ప్రయత్నించారు. ఈ విషయంపై యూపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. చెప్పులు, రాళ్లు రువ్వేలా ప్రేరేపించిన వారిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. కాగా, సంభాల్ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అల్లర్లు చోటుచేసుకుండా భద్రత దళాలు ఉన్నట్లు సంభాల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనుజ్ కుమార్ చౌదరి వెల్లడించారు.