Site icon Prime9

Robert Vadra: ప్రజలు నన్ను రాజకీయాల్లోకి రమ్నంటున్నారు.. రాబర్ట్ వాద్రా

Robert vadra

Robert vadra

Robert Vadra:దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి కొనసాగుతోంది. రెండవ విడత పోలింగ్‌ ముగిసింది. అయితే అందరి దృష్టి గాంధీలకు కంచుకోట అయిన అమెధీ, రాయబరేలిపై పడింది. ఈ రెండ నియోజకవర్గాల నుంచి రాహుల్‌, ప్రియాంకాగాంధీలు పోటీ చేయాలి. 2019 లోకసభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ చేతిలో రాహుల్‌ ఓడిపోయిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయాలంటే భయపడుతున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ రెండు నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. అమెధీ నుంచి రాహుల్‌ బావ రాబర్డ్‌ వాద్రా పోటీ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా రాబర్ట్‌ వాద్రా మాత్రం దేశ ప్రజలు తనను రాజకీయాల్లో రావాలని కోరుతున్నారని ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో మీడియాత మాట్లాడుతూ చెప్పారు. బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని.. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. దేశ ప్రజలు గాంధీ కుటుంబానికి అండగా ఉన్నారు. అదే సమయంలో రాహుల్‌, ప్రియాంకాలు దేశ ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్నారని, దేశ ప్రజలు కూడా వారికి మద్దతు తెలుపుతున్నారని వాద్రా అన్నారు.

అమెథీ నుంచి పోటీ చేయాలని..(Robert Vadra)

ప్రియాంకా గాంధీ భర్త కూడా అయిన రాబర్ట్ వాద్రా విషయానికి వస్తే ఆయన అమెథీ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి గతంలో ఆసక్తి కనబర్చారు. యావత్‌ దేశం కూడా తనను రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని కోరుతున్నారన్నారు. బీజేపీకి చెందిన అమెథీ ఎంపీ స్మృతి ఇరానీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఆమె నెరవేర్చలేదని వాద్రా అన్నారు. తాను 1999 నుంచి రాజకీయాల్లో చురుకుగా ఉన్నాను. అమెథీ ప్రజలతో దగ్గరి సంబంధాలున్నాయి. ఈ నెల ప్రారంభంలో కూడా వాద్రా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమెధీ ప్రజలు తనను అమెథీ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాలని కోరుతున్నారు. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. స్మృతి ఇరానీ ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. అందుకే గాంధీ కుటుంబసభ్యులు అమెథీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలనేది అమెథీ ప్రజల అభప్రాయం. కాగా అమెథీ నుంచి పోటీ చేస్తే గాంధీ కుటుంబసభ్యులను ఈ సారి భారీ మెజార్టీతో గెలిపిస్తారని రాబర్ట్‌ వాద్రా ఆశాభావం వ్యక్తం చేశారు.

అమెథీకి ప్రాతినిధ్యం వహించాలని తనను ఇక్కడి ప్రజలు కోరుతున్నారని వాద్రా ఈ నెల 4న అన్నారు. ఇటీవలే రాబర్డ్‌ వాద్రా పోస్టర్లు అమెథీ నియోజకవర్గం పార్టీ కార్యాలయం బయట వెలిశాయి. దీంతో వాద్రా అమెథీ నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అయితే విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం అమెథీ, రాయబరేలీ నుంచి రాహుల్‌, ప్రియాంకా గాంధీలు పోటీ చేస్తారని, వచ్చే వారం వీరు నామినేషన్‌ ఫైల్‌ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా అమెథీతో పాటు రాయబరేలి లోకసభ నియోజకవర్గాలకు మే 20న పోలింగ్‌ జరుగనుంది. మరి రాబర్ట్‌ వాద్రా అమెథీ బదులు వేరే నియోజకవర్గం కేటాయిస్తారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Exit mobile version